ఆదివారం 31 మే 2020
National - May 21, 2020 , 16:27:45

జీ-7 సదస్సు నిర్వహణపై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

జీ-7 సదస్సు నిర్వహణపై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: అమెరికా ఆతిథ్యంలో జరుగాల్సి ఉన్న జీ-7 సదస్సు నిర్వహణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కాకుండా అన్ని దేశాల ప్రతినిధులు నేరుగా సదస్సుకు హాజరయ్యేలా చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న సమయంలో ట్రంప్‌ జీ-7 సదస్సుకు మొగ్గు చూపుతుండటం వెనుక బలమైన కారణమే ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జీ-7 లాంటి అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం ద్వారా అమెరికాలో కరోనా ప్రభావం పెద్దగా లేదనే సంకేతాలు ఇచ్చేందుకు ట్రంప్‌ తాపత్రయపడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 

వాస్తవానికి జీ-7 దేశాల సదస్సు 2020 మార్చిలో జరుగాల్సి ఉంది. ఈ సదస్సుకు అమెరికా ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ, కరోనా వైరస్‌ విజృంభించడంతో సదస్సు నిర్వహణను 2020 జూన్‌కు వాయిదా వేశారు. అయితే ఇప్పటికీ కరోనా ప్రభావం తగ్గకపోవడంతో జూన్‌లో వీడియో కాన్పరెన్స్‌ ద్వారా సదస్సు నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో జీ-7 సదస్సుకు ప్రతినిధులు నేరుగా హాజరయ్యేలా చర్యలు చేపడుతామని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.


logo