గురువారం 26 నవంబర్ 2020
National - Nov 09, 2020 , 15:35:58

ట్రంప్‌ మాదిరిగానే బీజేపీ ఓడిపోతుంది: ముఫ్తీ

ట్రంప్‌ మాదిరిగానే బీజేపీ ఓడిపోతుంది:  ముఫ్తీ

శ్రీనగర్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాదిరిగానే బీజేపీ కూడా ఓడిపోతుందని జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. జమ్ముకు చెందిన పలు వర్గాలతో సోమవారం ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై మండిపడ్డారు. ‘అమెరికాలో ఏం జరిగిందో చూశాం. ట్రంప్‌ దిగిపోయారు. అదే మాదిరిగా బీజేపీ కూడా’ అని వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్‌ 370ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత ఏడాది రద్దు చేయడంపై మెహబూబా విమర్శించారు. ఆర్టికల్‌ 370 అనేది ముస్లింలు లేక హిందువులకు సంబంధించిన అంశం కాదన్నారు. జమ్ముకశ్మీర్‌ ఉనికిని కాపాడేందుకు తెచ్చిన ప్రత్యేక చట్టమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 370ని రద్దు చేయడమేగాక అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని కూడా అవమానించిందని విమర్శించారు. దీన్ని రద్దు చేయడం వల్ల భవిష్యత్తు గురించి జమ్ముకశ్మీర్‌ ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. 

జమ్ముకశ్మీర్‌ను బీజేపీ అమ్మకానికి పెట్టిందని, ఇక్కడి భూములను కొనుగోలు చేయాలని బయటి వ్యక్తులను ఆహ్వానిస్తున్నదని ముఫ్తీ మండిపడ్డారు. మరి పండిట్ల గురించి ఏం ఆలోచించారు అని కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడి ఏడాదైనా కశ్మీర్‌ యువతకు ఎలాంటి ఉద్యోగాలు కల్పించలేదన్నారు. దీంతో మరోదారి లేక వారు తుపాకులను చేతపడుతున్నారని అన్నారు. సరిహద్దులో కాల్పుల గురించి మాట్లాడుతూ తిరంగా జెండా కోసం వేలాది మంది తమ ప్రాణాలను త్యాగం చేస్తున్నారని చెప్పారు. భారత్‌, పాకిస్థాన్‌ మధ్య జమ్ముకశ్మీర్‌ ఒక వారధిగా ఉండాలని ముఫ్తీ తెలిపారు. బీహార్‌లోని మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్‌కు ఆమె అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో ఆయన సరైన పంథా అనుసరించారని కొనియాడారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.