ఆదివారం 17 జనవరి 2021
National - Dec 26, 2020 , 14:41:53

వేతన సర్క్యులర్లను రద్దు చేయించాలని మంత్రి ఈశ్వర్‌కు వినతి

వేతన సర్క్యులర్లను రద్దు చేయించాలని మంత్రి ఈశ్వర్‌కు వినతి

హైదరాబాద్‌ : కొత్తగా గల్ఫ్‌ వెళ్లే కార్మికులకు కనీస వేతనాలు (రెఫరల్‌ వేజెస్‌) 30 నుంచి 50శాతం తగ్గిస్తూ భారత ప్రభుత్వం సెప్టెంబర్‌లో జారీచేసిన రెండు సర్కులర్లను రద్దు చేయించాలని కోరుతూ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు టీఆర్‌ఎస్‌ ఖతర్‌ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. పాత వేతనాలు అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మీడియా ఇన్‌చార్జి సాయి తేజ కుంబాజీతో పాటు గల్ఫ్ నాయకులు కోరారు. జీతం తగ్గిస్తూ జారీ చేసిన సర్క్యులర్లతో ఆరు అరబ్ గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న దాదాపు కోటి మంది ప్రవాస భారతీయ కార్మికులు, ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగుల ఎంప్లాయిమెంట్ కాంట్రాక్టులను, వీసాలను పొడగించకుండా స్వదేశానికి పంపించి, తక్కువ జీతాలకు కొత్తవారిని తీసుకునే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. స్పందించిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో గోళి శ్రీనివాస్, అటుకుల రాజేశ్‌, కాశెట్టి నాగరాజు, బొంగురాల మల్లేశం,షేక్ అజ్జు, అప్పం ప్రవీణ్, కొత్తకొండ హరీశ్‌ తదితరులు పాల్గొన్నారు.