బుధవారం 08 జూలై 2020
National - Jun 17, 2020 , 21:23:15

సైనికుల‌కు శాప‌మైన స‌బ్ జీరో ఉష్ణోగ్ర‌తలు !

సైనికుల‌కు శాప‌మైన స‌బ్ జీరో ఉష్ణోగ్ర‌తలు !

హైద‌రాబాద్‌: గాల్వ‌న్ వ్యాలీలో భార‌త‌, చైనా ద‌ళాలు గొడ‌వ ప‌డిన ఘ‌ట‌న‌లో ఇరు వైపుల మ‌ర‌ణాలు సంభ‌వించాయి. 20 మంది సైనికులు చ‌నిపోయిన‌ట్లు భార‌త సైన్యం స్ప‌ష్టం చేసింది. అయితే చైనా వైపు కూడా సుమారు 43 మంది పీఎల్ఏ సైనికులు ప్రాణాలు కోల్పోయి ఉంటార‌ని ఇంటెలిజెన్స్ సమాచారం ద్వారా తెలుస్తున్న‌ది.  వాస్త‌వానికి సోమ‌వారం జ‌రిగిన ఘ‌ట‌న‌లో.. సైనికులు ఫైరింగ్‌కు పాల్ప‌డ‌లేదు. కానీ రాడ్లు, లాఠీల‌తో కొట్టుకున్నారు.  చాలా తీవ్ర స్థాయిలో సైనికులు ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకున్నారు.  

అయితే తీవ్రంగా గాయ‌ప‌డ్డ సైనికులు.. అక్క‌డ ఉన్న వాతావ‌ర‌ణ ఉష్ణోగ్ర‌త‌ల‌ను త‌ట్టుకోలేక మ‌ర‌ణించిన ఉంటార‌ని అంచ‌నా వేస్తున్నారు. గాల్వ‌న్ వ్యాలీ.. అత్యంత ఎత్తు ప్ర‌దేశంలో ఉన్న‌ది. హిమాల‌య ప‌ర్వ‌తాల్లోని ఆ లోయ ఒక‌ర‌కంగా మంచు ప్రాంతం. అతి క‌ష్ట‌మైన హై ఆల్టిట్యూడ్ కొండ‌ల్లో.. ఉష్ణోగ్ర‌తలు మైన‌స్‌లో ఉంటాయి. క‌డ్డ‌క‌ట్టుకుపోయే చ‌లి ప్ర‌దేశం అది. అయితే రాడ్ల‌తో కొట్టుకోవ‌డం వ‌ల్ల సైనికుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి.  మైన‌స్ ఉష్ణోగ్ర‌త‌ల మ‌ధ్య గాయాలు తట్టుకోలేక‌.. సైనికులు ప్రాణాలు విడిచి ఉంటార‌ని అంచ‌నా వేస్తున్నారు. 

గాల్వ‌న్ న‌దీ ప‌రివాహాక ప్రాంతం చాలా క్లిష్ట‌మైంది. అక్క‌డ చాలా క‌ఠిన‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది. ఆ హై ఆల్టిట్యూడ్ కొండ‌ల్లో.. వాస్త‌వాధీన రేఖ ఉన్న‌ది.  గాల్వ‌న్‌కు స‌మీపంలో అక్సాయి చిన్ కూడా ఉంది.  ఈ వివాదాస్ప‌ద ప్రాంతం మాదే అని భార‌త్ అంటుంది. కానీ చాన్నాళ్ల నుంచి ఆ ప్రాంతం చైనా ఆధీనంలో ఉన్న‌ది.  దాదాపు 14000 ఫీట్ల ఎత్తున‌ ఉన్న కొండ‌ల న‌డుమ.. ఇరు దేశాల సైనికుల‌కు కొట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. ఆ ఘ‌ర్ష‌ణ‌లో కొంద‌రు సైనికులు వేగంగా ప్ర‌వ‌హిస్తున్న గాల్వ‌న్  న‌దిలో ప‌డిపోయారు. దాదాపు 80 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించే ఆ న‌దిలో నీళ్లు స‌బ్ జీరో టెంప‌రేచ‌ర్‌లో ఉంటాయి.  

తీవ్రంగా గాయ‌ప‌డ్డ దాదాపు 17 మంది భార‌తీయ‌ సైనికులు .. గాయాల వ‌ల్లే ప్రాణాలు విడిచిన‌ట్లు భావిస్తున్నారు. గ‌డ్డ‌క‌ట్టుకుపోయే చ‌లిలో ఆ సైనికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స‌ముద్ర మ‌ట్టానికి మూడు వేల మీట‌ర్ల ఎత్తులో ఉన్న ల‌డ‌ఖ్‌లో లోయ‌లు ఎక్కువే‌.  ఈ ప్రాంతాన్ని కోల్డ్ డెజ‌ర్ట్‌గా పిలుస్తారు. శీతాకాలంలో ఆ మంచు ఎడారిలో ఉష్ణోగ్ర‌త‌లు మైన‌స్ 20 వ‌ర‌కు వెళ్తాయి.  ఈ ప్రాంతంలో ఉన్నవారు ప‌ల్మోన‌రీ ఎడిమా, సెరిబ్ర‌ల్ ఎడిమా లాంటి ఇబ్బందుల‌తో చ‌నిపోయే ప్ర‌మాదం ఉంటుంది.  

సాధార‌ణంగా శాంతి ప్ర‌దేశంగా ఉండే ఎల్ఏసీ బోర్డ‌ర్ ఇప్పుడు క‌ఠినంగా త‌యారైంద‌ని సైనిక నిపుణులు చెబుతున్నారు. దౌల‌త్ బేగ్ ఓల్డీ బేస్‌కు వెళ్లేందుకు భార‌త్ వేసిన రోడ్డును వ్య‌తిరేకిస్తూ చైనా బ‌ల‌గాలు ఎల్ఏసీ వ‌ద్ద తిష్ట‌వేశాయి. ఆ ప‌రిణామాలే ఈ గొడ‌వకు దారితీశాయి. 
logo