బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 14, 2020 , 08:28:00

చంపేస్తారనే భయం.. విగ్రహాలు చేయించుకున్న ఎమ్మెల్యే

చంపేస్తారనే భయం.. విగ్రహాలు చేయించుకున్న ఎమ్మెల్యే

కోల్‌కతా : తనను చంపేస్తారనే భయంతో బతికుండగానే ఓ ఎమ్మెల్యే విగ్రహాలను తయారు చేయించుకున్నారు. తాను హత్యకు గురైన తర్వాత ప్రజలెవరూ మరిచిపోవద్దనే ఉద్దేశంతోనే ముందు జాగ్రత్తగా రెండు విగ్రహాలను తయారు చేయించుకున్నానని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జయంత్‌ నాస్కర్‌ చెప్పారు. 71 ఏళ్ల ఎమ్మెల్యే పశ్చిమ బెంగాల్‌లోని గోసాబా నియోజకవర్గం నుంచి ఆ రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే ఇంట్లో ఓ సమావేశం జరగ్గా కార్యకర్తలు తరలివచ్చారు. కార్యకర్తల కంట ఎమ్మెల్యే విగ్రహాలు పడ్డాయి. దీంతో ఆ విగ్రహాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. ఎమ్మెల్యే జయంత్‌ నాస్కర్‌ స్పందించారు.

అలీపూర్‌ సెంట్రల్‌ కరెక్షన్‌ హోమ్‌ నుంచి నలుగురు క్రిమినల్స్‌ తప్పించుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. తనను హత్య చేయించేందుకు స్థానిక నాయకులు ఆ నలుగురు క్రిమినల్స్‌తో ఒప్పందం చేసుకున్నట్లు జిల్లా డీఎస్పీ చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తనకు వై కేటగిరి భద్రత కల్పించారన్నారు. ఒక వేళ తనను క్రిమినల్స్‌ హత్య చేస్తే.. ప్రజలు మరిచిపోవద్దనే ఉద్దేశంతో విగ్రహాలను తయారు చేయించానని తెలిపారు. ఆ విగ్రహాలను ఎక్కడ ప్రతిష్టించుకుంటారనే విషయాన్ని ప్రజలకు వదిలేస్తున్నానని జయంత్‌ నాస్కర్‌ చెప్పారు. సొంత పార్టీలోనే తనకు శత్రువులు ఉన్నారని.. వారంతా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
logo