శనివారం 06 జూన్ 2020
National - May 14, 2020 , 08:35:25

గ్రామానికి సొంతంగా రోడ్డు వేసుకుంటున్న గిరిజనులు

గ్రామానికి సొంతంగా రోడ్డు వేసుకుంటున్న గిరిజనులు

విశాఖపట్నం : రోడ్డు సౌకర్యం లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజనులు విసిగిపోయి తమ గ్రామానికి సొంతంగా రోడ్డు వేసుకునేందుకు పూనుకున్నారు. ఈ ఘటన ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని అనంతగిరి మండలంలోని గిరిజన ఆవాస గ్రామం మండ్రెబు. ఈ ఆవాస గ్రామం పెద్దకోట పంచాయతీకి 30 కిలోమీటర్ల దూరంలో అదేవిధంగా మండల కేంద్రానికి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎటువంటి రోడ్డు సదుపాయం లేని కారణంగా ఎక్కడికి వెళ్లాలన్నా ఇప్పటికీ గుర్రాలపైనే వెళ్తుంటారు గ్రామస్తులు. ఈ ఆవాస గ్రామంలో పాఠశాల గానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గానీ కనీసం తాగేందుకు స్వచ్ఛమైన మంచినీరు కానీ లభించదు. ఆనంద్‌ అనే గ్రామస్తుడు మాట్లాడుతూ... పనుల నిమిత్తం ఎక్కువగా తాము దేవరపల్లికి వెళ్తుంటామన్నారు. రేషన్‌ బియ్యం తీసుకోవాలన్నా, ఉపాధిహామీ పనుల కూలీ డబ్బు తీసుకోవాలన్నా దేవరపల్లికి గుర్రాలపైనే పోతామని తెలిపాడు. నడక ద్వారా అంతదూరం వెళ్లేందుకు కష్టంగా ఉంటుంది కాబట్టి గుర్రాలను ఆశ్రయిస్తున్నట్లు చెప్పాడు. రోడ్డు సౌకర్యం తాము ఎదుర్కొంటున్న ఎన్నో బాధలకు పరిష్కారం అవుతుందన్నారు. సరైనా రోడ్డు సౌకర్యం లేని కారణంగా గ్రామంలో సిమెంట్‌, స్టీల్‌ వంటి ఇతర సౌకర్యాలతో కూడిన ఏ పనులు చేసుకోలేకపోతున్నట్లు మరో గ్రామస్తుడు తెలిపాడు. అందుకే తాము సొంత డబ్బులతో రహదారి నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు.


logo