శనివారం 11 జూలై 2020
National - Jun 05, 2020 , 15:26:48

15 రోజుల్లోగా వ‌ల‌స కూలీల‌ను త‌ర‌లించండి: సుప్రీంకోర్టు

15 రోజుల్లోగా వ‌ల‌స కూలీల‌ను త‌ర‌లించండి:  సుప్రీంకోర్టు

హైద‌రాబాద్‌: వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వ‌ల‌స కార్మికుల‌ను 15 రోజుల్లోగా వారి వారి స్వంత రాష్ట్రాల‌కు త‌ర‌లించాల‌ని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశించింది.  వ‌ల‌స కార్మికుల అంశంపై సుప్రీంలో విచార‌ణ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.  జూన్ 3వ తేదీ నుంచి వ‌ల‌స కార్మికుల‌ను త‌ర‌లించేందుకు ఇప్ప‌టి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 4228 శ్రామిక్ రైళ్ల‌ను న‌డిపిన‌ట్లు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా కోర్టుకు తెలియ‌జేశారు. ఈ రైళ్ల‌లో మొత్తం 57 ల‌క్ష‌ల మందిని త‌ర‌లించిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. మ‌రో 41 ల‌క్ష‌ల మంది రోడ్డు మార్గంలో వెళ్లిన‌ట్లు ఆయ‌న చెప్పారు. అన్ని న‌గ‌రాల నుంచి దాదాపు కోటి మంది వ‌ర‌కు వ‌లస కార్మికులు త‌మ స్వంత రాష్ట్రాల‌కు వెళ్లిన‌ట్లు తుషార్ మెహ‌తా తెలిపారు.  

ఎక్కువ శాతం రైళ్లు.. యూపీ, బీహార్ రాష్ట్రాల‌కు వెళ్లిన‌ట్లు తుషార్ కోర్టుతో పేర్కొన్నారు. అయితే ఇంకా ఎంత మంది వ‌ల‌స కార్మికుల‌ను స్వంత రాష్ట్రాల‌కు పంపాలి, ఇంకా ఎన్ని రైళ్లు అవ‌స‌రం ఉంద‌న్న డేటా త‌మ ద‌గ్గ‌ర ఉంద‌ని ఆయ‌న కోర్టు చెప్పారు.  ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా వ‌ల‌స కార్మికుల చార్ట్‌ను త‌యారు చేసిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. జ‌స్టిస్ అశోక్ భూష‌ణ్‌, సంజ‌య్ కిష‌న్ కౌల్‌, ఎంఆర్ షాల‌తో కూడిన త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం వ‌ల‌స కూలీల పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రుపుతున్న‌ది.  మ‌హారాష్ట్ర నుంచి 802 రైళ్లు న‌డిపిట్లు తుషార్ తెలిపారు. 

ఇంకా మిగిలి ఉన్న వ‌ల‌స‌కూలీల‌ను త‌ర‌లించేందుకు కేంద్రానికి, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు మ‌రో 15 రోజుల స‌మ‌యాన్ని కేటాయిస్తున్న‌ట్లు కోర్టు తెలిపింది.  వ‌ల‌స కూలీల‌కు ఆయా రాష్ట్రాలు ఎటువంటి ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తున్న‌దో చెప్పాల‌ని, ఇంకా స‌హాయ చ‌ర్య‌ల గురించి కూడా వెల్ల‌డించాల‌ని కోర్టు త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది.  వ‌ల‌స‌కూలీల రిజిస్ట్రేష‌న్ జ‌ర‌గాల‌ని పేర్కొన్న‌ది. అయితే వ‌ల‌స కూలీల రిజిస్ట్రేష‌న్ వ్య‌వ‌స్థ ప‌నిచేయ‌డం లేద‌ని, వేలాది మంది కార్మికులు రిజిస్ట్రేష‌న్ చేసుకోలేక‌పోతున్నార‌ని అడ్వ‌కేట్ కొలిన్ గొంజాల్వేస్ త‌న పిటిష‌న్‌లో తెలిపారు. వ‌ల‌స కూలీల రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను మ‌రింత స‌ర‌ళ‌త‌రం చేయాల‌న్నారు. 


logo