బుధవారం 08 జూలై 2020
National - Jun 16, 2020 , 17:02:10

టీచర్ల స్కామ్‌లో అరెస్టులు.. పోలీస్‌ అధికారి బదిలీ

టీచర్ల స్కామ్‌లో అరెస్టులు.. పోలీస్‌ అధికారి బదిలీ

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల వెలుగుచూసిన నకిలీ టీచర్ల స్కామ్‌లో ఓ వైపు అరెస్టులు జరుగుతున్న వేళ ఓ కీలక పోలీస్‌ అధికారిని బదిలీ చేయడం కలకలం రేపింది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 69 వేల ఉపాధ్యాయుల నియామకంపై ఇటీవల పలు ఆరోపణలు వచ్చాయి. అనామిక శుక్లా అనే ఉపాధ్యాయురాలు ఏక కాలంలో పలు ప్రభుత్వ స్కూళ్లల్లో పనిచేస్తున్నట్లు మోసగించి సుమారు రూ.కోటికిపైగా వేతనం పొందిటనట్లు ఇటీవల బయటపడింది. ఇలాంటి మరి కొన్ని మోసాలు వెలుగుచూడటంతో టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌కు సంబంధించిన పలువురిని ప్రయోగ్‌రాజ్‌ జిల్లా ఎస్పీ సత్యార్థ్ అనిరుధ్ పంకజ్ ఇటీవల అరెస్ట్‌ చేశారు. అరెస్టైన వారిలో ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నేత, పలు ప్రవేట్‌ విద్యాసంస్థలు నిర్వహిస్తున్న కేఏ పటేల్‌ కూడా ఉన్నారు. 

మరోవైపు ఉన్నట్టుడి ఎస్పీ సత్యార్థ్ అనిరుధ్ పంకజ్ ను బదిలీ చేస్తున్నట్లు సోమవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ఆయనకు ఇంకా ఏ పోస్టింగ్‌ ఇవ్వన్నట్లు తెలుస్తున్నది. అయితే సత్యార్థ్ అనిరుధ్ పంకజ్ మంగళవారం ఉదయం కరోనా వార్డులో చేరారు. కరోనా సోకినట్లు నిర్ధారైన పలువురిని ఆయన ఇటీవల కలువడంతోనే కరోనా వార్డులో ఉంచి పరీక్షలు నిర్వహించినట్లు ప్రయోగ్‌రాజ్‌ పాలక మండలి అధికారులు తెలిపారు. కాగా,  ఆ ఎస్పీని ఎందుకు బదిలీ చేశారని కాంగ్రెస్‌ పార్టీ యూపీ బాధ్యతలు చూస్తున్న ప్రియాంకా గాంధీ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. కుంభకోణానికి సంబంధించిన వ్యక్తులను అరెస్ట్‌ చేసిన ఆయన నిజాయితీకి ప్రతి ఒక్కరు మద్దతుగా నిలువాలని అందులో పేర్కొన్నారు.

logo