ఆదివారం 23 ఫిబ్రవరి 2020
భారత పరిశ్రమలపై కరోనా కాటు!

భారత పరిశ్రమలపై కరోనా కాటు!

Feb 15, 2020 , 03:03:57
PRINT
భారత పరిశ్రమలపై కరోనా కాటు!
  • మరో మూడు నాలుగు నెలల్లో నియంత్రించకపోతే తీవ్ర ప్రభావం
  • చైనా నుంచి విడిభాగాల సరఫరాకు అంతరాయం
  • పడిపోనున్న ఉత్పత్తి.. పెరుగనున్న ధరలు.. ఉద్యోగాలకు కోత పడే ప్రమాదం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: చైనాతోపాటు ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ తీవ్రత ఇలానే కొనసాగితే భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉన్నది. తమ ఉత్పత్తి కార్యకలాపాలపై ఇది పెను ప్రభావం చూపనుందని భారత పరిశ్రమలు భయందోళనలు వ్యక్తంచేస్తున్నాయి. వైరస్‌ నియంత్రణలో వచ్చే మూడు నాలుగు నెలలు అత్యంత కీలకమని, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీల భవిష్యత్తు దానిపైనే ఆధారపడి ఉన్నదని ఇండ్‌-ఆర్‌ఏ తాజా నివేదిక వెల్లడించింది. ఆ వ్యవధిలోగా వైరస్‌ను కట్టడి చేయలేకపోతే, ఆ ప్రభావం భారత కంపెనీలపై తీవ్రంగా ఉండనుందని తెలిపింది. 


2003లో సార్స్‌ వైరస్‌ సంభవించినప్పటి కంటే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థపై అధిక ప్రభావం పడుతుందని హెచ్చరించింది. నాడు చైనాపై ప్రపంచదేశాలు తక్కువగా ఆధారపడి ఉన్నాయని, నేడు చైనా ప్రపంచ తయారీ హబ్‌గా రూపాంతరం చెందిందని వివరించింది. ప్రపంచ జీడీపీలో చైనా వాటా దాదాపు 15 శాతమని, అక్కడి తయారీ రంగం కుంటుపడితే ఆ ప్రభావం అంతర్జాతీయంగా ఉంటుందని పేర్కొంది. ఆరు నెలల్లోగా చైనా ఆ వైరస్‌ను నియంత్రించలేకపోతే.. దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని మార్కెట్స్‌మోజోడాట్‌కామ్‌ సీఐవో సునిల్‌ డమానియా వ్యాఖ్యానించారు. 2020 ఆర్థిక సంవతర్సానికి ప్రపంచ జీడీపీ 20 బేసిస్‌ పాయింట్ల వరకు తగ్గవచ్చని తెలిపారు. 


భారత్‌పై ఎంతమేరకు..

ఆర్థిక మాంద్యంతో భారత్‌ ఇప్పటికే సతమతమవుతున్నది. చైనాలో తయారయ్యే విడిభాగాలపైనే దేశంలోని కీలక రంగాలు ఆధారపడిన నేపథ్యంలో మరిన్ని కష్టాలు ఎదురుకానున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 6.5 శాతం వృద్ధిరేటును భారత్‌ అంచనావేస్తున్నది. అయితే  కరోనా వైరస్‌ నేపథ్యంలో చైనా నుంచి కీలక విడిభాగాల సరఫరాకు ఇలానే అంతరాయం కొనసాగితే ఆ అంచనాలు నీరుగారే అవకాశం ఉన్నది. ఆటోమొబైల్స్‌, కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, డ్రగ్స్‌, ఫార్మాస్యూటికల్స్‌ వంటి రంగాలపై తీవ్ర ప్రభావం పడనుంది. అనుబంధ రంగాలు దెబ్బతిననున్నాయి. సరఫరాకు అంతరాయం ఏర్పడడం వల్ల ఉత్పత్తి తగ్గడమే కాకుండా అమ్మకాలపైనే ప్రభావం పడనుంది. ఇది ఉద్యోగాల కోత, అధిక ద్రవ్యోల్బణానికి దారితీయనుంది. చైనాలోకి కంపెనీలు ఇప్పటికీ ఉత్పత్తిని పునరుద్ధరించకపోవడంతో ఆ ప్రభావం ఇప్పటికే భారత్‌లోని ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌, ఫోన్‌ తయారీ కంపెనీలపై పడింది.


 పరిస్థితి ఇలానే కొనసాగితే ధరలు పెరిగే అవకాశం ఉన్నదని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు పరికరాల కొరత నేపథ్యంలో చైనా కంపెనీలు ధరలు పెంచుతుండడంతో ఆ ప్రభావం భారత కంపెనీలపై అధికంగా పడుతున్నది. స్మార్ట్‌ఫోన్ల మాదిరిగానే, ఆటోమొబైల్‌ కంపెనీలు కూడా చైనా నుంచి కీలకమైన విడిభాగాలను దిగుమతి చేసుకుంటున్నాయి. కరోనా వైరస్‌ కారణంగా చైనాలో ఆటోమొబైల్‌ రంగ ఉత్పత్తి 60 శాతం వరకు పడిపోయింది. దీని ప్రభావం భారత్‌తోపాటు ఇతర ప్రపంచ దేశాలపై పడనుందని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ నివేదిక వెల్లడించింది. భారత్‌లో ఉత్పత్తి 8 శాతం వరకు పడిపోవచ్చని ఫిచ్‌ నివేదిక అంచనావేసింది. కాగా, కరోనా వైరస్‌ కారణంగా భారత్‌కు ఎదురుకానున్న మరో ప్రమాదం.. ఉద్యోగాల కోత. ఉత్పత్తి తగ్గిన నేపథ్యంలో పలు పరిశ్రమలు కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తొలగించే ప్రమాదం ఉన్నది.  


logo