బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 09:32:57

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై ఢిల్లీలో రైతుల నిర‌స‌న.. ట్రాక్ట‌ర్ ద‌గ్ధం

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై ఢిల్లీలో రైతుల నిర‌స‌న.. ట్రాక్ట‌ర్ ద‌గ్ధం

న్యూఢిల్లీ: కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన మూడు రైతు చ‌ట్టాల‌‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇందులోభాగంగా దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వ‌ద్ద ఈరోజు ఉద‌యం రైతుల నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఓ ట్రాక్ట‌ర్‌ను కాల్చివేశారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు మంటల‌ను ఆర్పి, ట్రాక్ట‌ర్‌ను అక్క‌డి నుంచి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌కు పాల్పడిన‌వారిని అదుపులోకి తీసుకున్నారు. 

ఈరోజు ఉద‌యం 15 నుంచి 20 మంది వ్య‌క్తులు ఇండియా గేట్ వ‌ద్ద గుమికూడారు. కొద్దిసేప‌టి త‌ర్వాత త‌మ‌తో తీసుకువ‌చ్చిన ఓ పాత ట్రాక్ట‌ర్‌ను కాల్చివేశారని న్యూఢిల్లీ డీసీపీ తెలిపారు. నిర‌స‌న‌కారులు కాంగ్రెస్ అనుకూల నినాదాలు చేశార‌ని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన‌వారిని గుర్తించామ‌ని వెల్ల‌డించారు. వారిపై కేసు న‌మోదుచేశామ‌ని, ద‌ర్యాప్తు చేస్తున్నామ‌న్నారు.  

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ కాంగ్రెస్‌పార్టీ దేశ‌వ్యాప్త ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా క‌ర్ణాట‌క‌లో బంద్ కొన‌సాగుతున్న‌ది. కాంగ్రెస్‌పార్టీతోపాటు అఖిల‌భార‌త కిసాన్ స‌భ‌, ఇత‌ర సంఘాలు ఇందులో పాల్గొంటున్నాయి. బంద్‌కు ప్ర‌జ‌లు మ‌ద్ద‌తునివ్వాల‌ని రైతుసంఘాలు కోరాయి. అదేవిధంగా పంజాబ్ ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్ స్వ‌యంగా ధ‌ర్నాలో పాల్గొన‌నున్నారు. రాష్ట్రంలోని ఖ‌ట్క‌ర్ క‌లాన్‌లో బైఠాయించి వ్య‌వసాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న తెల‌పనున్నారు.  


logo