శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 25, 2020 , 00:59:36

536 కేసులు నమోదు

536 కేసులు నమోదు

-దేశవ్యాప్తంగా మరో 68  కేసులు

-10 మందికి చేరిన  మృతుల సంఖ్య

న్యూఢిల్లీ, మార్చి 24: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మంగళవారం కొత్తగా మరో 68 కేసులు నమోదు కావడంతో కేసుల సంఖ్య 536కి చేరింది. వీరిలో 43 మంది విదేశీయులు. వ్యాధి బారిన పడ్డ వారిలో 40 మంది కోలుకున్నారు. ఈ వైరస్‌ బారిన పడి మహారాష్ట్రలో తాజాగా మరొకరు మరణించారు. దీంతో ఈ మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 10కి చేరింది. పలు రాష్ర్టాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతున్నా కొన్ని చోట్ల ప్రజలు రోడ్ల మీదకు రావడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నది. ఎవరైనా లాక్‌డౌన్‌ ఆదేశాలను ధిక్కరించి రోడ్ల మీదకు వస్తే కర్ఫ్యూ విధించడానికి కూడా వెనకడుగు వేయవద్దని కేంద్రం రాష్ర్టాలకు సూచించింది. ఇక మహారాష్ట్రలో కరోనా తీవ్రత అధికంగా ఉన్నది. వైరస్‌ వల్ల ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఇద్దరు మరణించగా.. తాజాగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మరణాల పరంగా చూస్తే మహారాష్ట్రలో-3, బీహార్‌, కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్‌, పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌, హిమాచల్‌ప్రదేశ్‌లలో ఒకొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 

సమీక్షలు.. ఆదేశాలు

  • కరోనా విస్తరించకుండా తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ అధికారులతో ఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. వైరస్‌ను కట్టడి చేయడానికి మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 
  • కరోనాపై పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా అన్ని రాష్ర్టాలకు లేఖలు రాశారు.
  • కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా కూడా అన్ని రాష్ర్టాల డీజీపీలతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 
  • రాష్ర్టాల్లోని పశువైద్యశాలలు, క్లినిక్‌లు సాధారణ విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలని రాష్ర్టాలను కేంద్రం కోరింది.
  • కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా ఢిల్లీని లాక్‌డౌన్‌ చేయడంతో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా షాహీన్‌బాగ్‌లో ఆందోళనలు జరుపుతున్నవాళ్లు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

ఈశాన్య భారతానికి పాకిన కరోనా

ఇంఫాల్‌: ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఈశాన్య భారతంలో తొలి కరోనా వైరస్‌ కేసు వెలుగు చూసింది. మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌కు చెందిన 23 ఏండ్ల యువతికి కొవిడ్‌-19 పాజిటివ్‌ లక్షణాలు కనిపించినట్టు మంగళవారం అధికారులు నిర్ధారించారు. బ్రిటన్‌లో చదువుకుంటున్న ఆ యువతి ఈ నెల 18న లండన్‌ నుంచి ఢిల్లీ మీదుగా కోల్‌కతా వెళ్లింది. అక్కడ మూడ్రోజులు ఉన్న తర్వాత సోదరుడితో కలిసి మణిపూర్‌కు వచ్చింది. ఇంటికి రాగానే శ్వాస సంబంధ సమస్యలు తలెత్తడంతో జవహర్‌లాల్‌ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చికిత్స పొందేందుకు రాగా, పరీక్షలు జరిపిన అక్కడి వైద్యులు ఆమెకు కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారించారు. దాంతో ఆమెతోపాటు ఆమె కుటుంబసభ్యులను క్వారంటైన్‌లో ఉంచారు.


logo