రేపే సార్వత్రిక సమ్మె

- ఒక్కతాటిపైకి సకల కార్మిక, కర్షక, ఉద్యోగ సంఘాలు
- గల్లీ నుంచి ఢిల్లీ దాకా నిరసనలు, సభలకు సమాయత్తం
- ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి
- కార్మికులకు ఉద్యోగ, ఆరోగ్య, జీవిత భద్రత కల్పించాలి
- పనిగంటల పెంపును ఆపాలి.. కనీస వేతనం పెంచాలి
- మోదీ సర్కారు దిగిరాకపోతే ఉద్యమం ఉధృతం చేస్తాం
- తమను బానిసలుగా మార్చే చట్టాలపై సమరశంఖం
- బీజేపీ దుర్మార్గ పాలనపై కార్మికలోకం తిరుగుబాటు
- పనిగంటల పెంపును ఆపాలి కనీస వేతనం పెంచాలి
- రోడ్లపైకి 30 కోట్లమంది కార్మికులు, ఉద్యోగులు, రైతులు!
- 16 డిమాండ్లతో 9 జాతీయ కార్మికసంఘాల అల్టిమేటం
ఉద్యోగం కావాలా? వెట్టి చాకిరీ చేయాల్సిందే! పనికి తగిన వేతనం అడిగావా? నీకు తెల్లారి పనే ఉండదు! హక్కుల కోసం సమ్మె చేస్తానంటావా? అది దేశద్రోహమంత నేరం! యజమానికి నువ్వు బానిస. ఎప్పుడు పనికి రమ్మంటే అప్పుడు రావాల్సిందే.. ఎన్ని గంటలైనా పని చేయాల్సిందే. ఏమిటిది అని అడుగకూడదు. అధిక పనికి అదనపు వేతనం అస్సలు అడుగరాదు.. సెలవులు ఇచ్చినప్పుడే తీసుకోవాలి.. ఇవ్వకున్నా కిక్కురుమనొద్దు. నీకు జీతం ఇస్తున్నాడు కాబట్టి నీపై యజమానికి అపరిమిత హక్కులుంటాయి! ఇదీ కేంద్రంలోని నరేంద్రమోదీ తెచ్చిన నూతన లేబర్ కోడ్ల సారాంశం. తమ జీవితాలనే బానిసత్వంలోకి విసిరేస్తున్న ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కార్మికులు, ఉద్యోగులు ఒక్కటై కదం తొక్కుతున్నారు. దేశానికి అన్నం పెడుతున్న కర్షకులు కూడా మోదీ సర్కారుపై పోరులో కార్మికులు, ఉద్యోగులతో భుజం కలిపారు. ప్రధానమైన 16 డిమాండ్లతో తొమ్మిది జాతీయ కార్మిక సంఘాలతోపాటు బీమా, బ్యాంకు, రక్షణ, ఫార్మా, పీఎస్‌యూ, కేంద్ర, రాష్ర్టాల ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఏకమై 26న సార్వత్రిక సమ్మె చేస్తున్నాయి.
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తమకు అనుకూలురైన కొద్దిమంది కార్పొరేట్లకు సంపదను దోచిపెట్టేందుకు దేశంలోని కోట్లమంది కార్మికుల జీవితాలను ఎన్డీఏ పణంగా పెట్టింది. కార్మికుల జీవితాలకు భద్రతను, ఉద్యోగాలకు భరోసాను అందిస్తున్న 44 లేబర్ చట్టాలను ఒక్క కలంపోటుతో ఖతం చేసి చెత్తబుట్టలో వేసింది. బ్రిటిష్ కాలంనాటి బానిస చట్టాలను కొత్తరూపంలో మళ్లీ అమల్లోకి తెచ్చింది. 2002లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం మధ్యలోనే వదిలేసిన ఈ నల్లచట్టాలను మోదీ ప్రభుత్వం ఇటీవలే నాలుగు కోడ్ల రూపంలో తెచ్చింది. 1.వేతనాలు, 2.భద్రత, ఆరోగ్యం, 3.పని పరిస్థితులు, 4.సామాజిక భద్రత. వీటి పేరుతో పాశవిక చట్టాలను కార్మికులపై రుద్దుతున్నది. ఈ చట్టాలు పూర్తిగా అమల్లోకి వచ్చిన వెంటనే కార్మికులకు సంఘాలు పెట్టుకొని, సమ్మెచేసే హక్కులు చేజారిపోతాయి. గతంలో సమ్మె చేయాలంటే 14 రోజుల ముందు యాజమాన్యానికి నోటీసు ఇస్తే సరిపోయేది. ప్రస్తుతం దానిని 60 రోజులకు పెంచారు. సమ్మెకు వ్యతిరేకంగా యాజమాన్యమే ట్రిబ్యునల్‌కు వెళ్లే వెసులుబాటును కూడా బీజేపీ సర్కారు ఇచ్చింది. వివాదం ట్రిబ్యునల్‌లో ఉన్నంతకాలం కార్మికులు సమ్మె చేయటానికి వీలుకాదు. దాంతో అంతిమంగా సమ్మె చేసే అవకాశమే ఉండదు. కార్మిక సంఘాలను యాజమాన్యాలు గుర్తించాలనే నిబంధన పాత చట్టాల్లో లేదు. కొత్త చట్టం ప్రకారం ఒక పరిశ్రమలోని మొత్తం కార్మికుల్లో కనీసం 51% మంది సభ్యత్వమున్న సంఘాన్నే గుర్తింపు సంఘంగా పరిగణిస్తారు. వారితోనే సంప్రదింపులు జరుపుతారు. గతంలో 10 మంది కంటే ఎక్కువ ఉద్యోగులున్న సంస్థను పరిశ్రమగా నిర్వచించేవారు. ఇప్పుడు ఆ సంఖ్యను 20కి పెంచారు.
12 గంటల పని.. ఓటీలు ఉండవు..
వేతనాల కోడ్‌ను పార్లమెంట్ 2019లో ఆమోదించింది. ఇందులో వేతనాల చెల్లింపు, కనీస వేతనం, బోనస్ చెల్లింపు, సమాన వేతనాల చట్టాలను చేర్చారు. పనికి ఆహార పథకంలో ఇచ్చే వేతనాలను ఈ కోడ్ నుంచి తొలిగించారు. పాత చట్టం ప్రకారం యాజమాన్యం జమా ఖర్చులను కార్మికులు తనిఖీ చేసి బోనస్ రేటును నిర్ణయించే హక్కు ఉండేది. కొత్త కోడ్ ద్వారా దానిని రద్దుచేశారు. బోనస్ ఎంత చెల్లించాలనేదానిపై ప్రభుత్వం నియమించిన అధికారి.. యజమాని నుంచి బ్యాలెన్స్ షీట్‌ను కోరాలి. అందులో ఉండే విషయాలను ఆ యజమాని ఒప్పుకుంటే తప్ప ఆ అధికారి బహిర్గతం చేయవద్దనే నిబంధన కూడా విధించారు. తద్వారా బోనస్ నిర్ణయం అధికారి, యాజమాని చేతుల్లోకి వెళ్లిపోయింది. గతంలో అనేక పోరాటాల ఫలితంగా 8 గంటల పని విధానం అమల్లోకి రాగా.. ఇప్పుడు మోదీ సర్కారు దానినీ మార్చేసింది. యాజమానికి కోరుకుంటే 12 గంటలపాటు పనిచేయాలి. అందుకు ఎలాంటి ఓటీ (ఓవర్ టైమ్) వేతనాలను చెల్లించబోరు.
ప్రమాదాలకు కార్మికులదే బాధ్యత..
మోదీ నల్ల చట్టాలు ఏదైనా ఫ్యాక్టరీలో ప్రమాదాలు జరిగితే కార్మికులను కూడా బాధ్యులను చేస్తున్నాయి. గతంలో యాజమాన్యాలదే బాధ్యత ఉండేది. ప్రమాదాలకు కార్మికుడు కారణమని నిర్ధారిస్తే రూ.10వేల జరిమానా, జైలుశిక్ష విధించే అవకాశాన్ని కొత్త చట్టంలో పొందుపర్చారు. ఫ్యాక్టరీల చట్టం, గనుల చట్టం, డాక్ వర్కర్, బిల్డింగ్, ఇతర నిర్మాణ కార్మికుల ఉపాధి, పని నియమాల క్రమబద్ధీకరణ, సినీ వర్కర్స్ అండ్ సినిమా థియేటర్స్ వర్కర్స్ చట్టం తదితర వాటికి సంబంధించి మొత్తం 13 పాత చట్టాలను ఒక కోడ్‌గా తెచ్చారు. గతంలో ఒక్కో పరిశ్రమకు సంబంధించిన కార్మికులకు వారి పని స్వభావాన్ని బట్టి పని భద్రత, ఆరోగ్యం, సంక్షేమ పథకాలు వేర్వేరుగా ఉండేవి. ఇప్పుడు అన్ని చట్టాలు ఒకే గొడుగు కిందికి రావటంతో ఆ అవకాశం లేకుండా పోయింది. సామాజిక భద్రత కోడ్- 2020లో పీఎఫ్, ఈఎస్ఐ, పరిహారం, ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజీ, మెటర్నిటీ బెనిఫిట్, గ్రాట్యుటీ, వెల్ఫేర్, అసంఘటిత కార్మికులకు సంబంధించిన తొమ్మిది పాత చట్టాలను చేర్చారు. ఇందులో దారుణమైన విషయం ఏమిటంటే ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సముదాయం తమ సొంత నివాసం కోసం రూ.50 లక్షల లోపు విలువైన భవనాన్ని నిర్మించుకుంటే అది ఇతర నిర్మాణాల పరిధిలోకి రాదు. దాంతో ఈ భవన నిర్మాణం కోసం పనిచేసే కార్మికులకు ప్రభుత్వం ఎలాంటి భద్రత, సంక్షేమ చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదు. కార్మికుల సంక్షేమం, భద్రత, చట్టాల అమలుపై వచ్చే ఫిర్యాదులను యాజమాన్యాలకే అప్పగించటం మరో దారుణం. ఇది దొంగకే తాళం చేతులను ఇచ్చినట్టుగా ఉందని ట్రేడ్ యూనియన్లు మండిపడుతున్నాయి.
ఇవీ సమ్మె డిమాండ్లు
పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా కనీస వేతనం నెలకు రూ.21 వేలు నిర్ణయించాలి.
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానం రద్దుచేసి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి.
ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న ప్రభుత్వరంగ సంస్థలు, జాతీయ బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు, రైల్వేలు, బొగ్గు, బీఎస్ఎన్ఎల్ తదితర సంస్థల ప్రైవేటీకరణ చర్యలను నిలిపేయాలి.
నిరుద్యోగులు స్వయం ఉపాధి కోసం పెట్టుకున్న ఎంఎస్ఎంఈలకు వడ్డీలేని రుణాలిచ్చి, కార్మికుల ఉపాధికి భద్రత కల్పించాలి.
అసంఘటిత కార్మికులకు కేంద్ర ప్రభుత్వమే భద్రత, భరోసా కల్పించాలి. విపత్తుల సమయంలో కార్మికులను ఆదుకోవడానికి బడ్జెట్లో 3% నిధులు కేటాయించి సమగ్ర చట్టాన్ని అమలు చేయాలి. అసంఘటిత కార్మికులకు ప్రత్యేకంగా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుచేయాలి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానం (కాంట్రిబ్యూటరీ పెన్షన్) రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలి.
ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లోని కార్మికులకు ఇచ్చే పెన్షన్‌ను రూ.10 వేలకు పెంచాలి.
ప్రభుత్వ విద్య, ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయాలి.
పేదలందరికీ ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం పంపి ణీ నిరంతరాయంగా కొనసాగాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వేతనాలను రోజుకు రూ.600కు పెంచి ఏటా 200 పనిదినాలు కల్పించాలి. దీనిని పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరించాలి.
కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న పేద ప్రజలను ఆదుకునేందుకు ఆదాయపన్ను పరిధిలోకి రాని ప్రతి కుటుంబానికి రూ.7,500 ఇవ్వాలి.
దళితులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి.
మహిళలకు పనిప్రదేశాల్లో రక్షణ కల్పించాలి. మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టాలి.
ఆటోలు నడిపేవారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న నూతన వాహన చట్టాన్ని రద్దు చేయాలి.
అన్నిజిల్లాల్లో ఆందోళనలు
అఖిల భారత ఉద్యోగుల సమాఖ్య నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులంతా సార్వత్రిక సమ్మెలో పాల్గొంటారు. గ్రేటర్లో ఎన్నికల విధులు నిర్వహించడం కోసం జీహెచ్ఎంసీ మినహా అన్ని జిల్లాల్లో ఆందోళనలు నిర్వహిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల రెగ్యులర్ పెన్షన్ పథకాన్ని తీసేసి కంట్రిబ్యూటరీ పెన్షన్ అమలు చేస్తున్నది. దీనిని రద్దు చేయాలన్న డిమాండ్‌తో సమ్మెలో పాల్గొంటున్నాం.
- మామిళ్ల రాజేందర్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు
ప్రభుత్వరంగ సంస్థలు గల్లంతు
ప్రభుత్వరంగ సంస్థలపై దేశ ఆర్థికాభివృద్ధి ఆధారపడి ఉంటుంది. జీడీపీ వృద్ధిలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. ఇవేవీ పట్టించుకోకుండా కేంద్రం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు భావి భారత్‌ను అంధకారమయం చేస్తాయని కార్మిక సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఎక్కువ లాభాలు వచ్చే రూట్లలో ప్రైవేటు రైళ్లకు అనుమతించిన కేంద్రం.. క్రమంగా రైల్వే అనుబంధ సంస్థలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 5 రైల్వే ప్రింటింగ్ ప్రెస్‌లకు తాళాలు వేయనున్నారు. ఇందులో సికింద్రాబాద్‌లోని నిజాం ప్రింటింగ్ ప్రెస్ కూడా ఉన్నది. రోజుకు 30 లక్షల టికెట్లు ముద్రించే ఈ ప్రెస్‌లో దాదాపు 200 మంది పని చేస్తున్నారు.
కేసీఆర్ రక్షిస్తుంటే మోదీ అమ్మేస్తున్నాడు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 26న కార్మిక, రైతు సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెకు తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నం. ప్రభుత్వరంగ సంస్థలుంటేనే దేశం బాగుంటుంది. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడేందుకు సీఎం కేసీఆర్.. బీహెచ్ఈఎల్ లాంటి సంస్థలకు వందల కోట్ల ఆర్డర్లు ఇస్తుంటే.. బీజేపీ సర్కారు మాత్రం వాటిని అమ్మకానికి పెట్టింది. ఇందుకు నిరసనగా కార్మికులు, రైతులు దేశవ్యాప్త సమ్మెకు సంసిద్ధమయ్యారు.
-రాంబాబు, టీఆర్ఎస్ కేవీ రాష్ట్ర అధ్యక్షులు
సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్ ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నాం. లాభాలు వచ్చే సంస్థలను అమ్మడం దారుణం. నిజాం కాలంనాటి ప్రింటింగ్ ప్రెస్‌ను కాపాడుకొనేందుకు మేం పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ పోతే చివరికి ఏం మిగులుతుంది?
- దీకొండ పద్మనాభం, ఆలిండియా ఓబీసీ ఫెడరేషన్, న్యూఢిల్లీ
విద్యుత్ సంస్థలను కాపాడుకొంటాం
తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కేందంలోని బీజేపీ ప్రభుత్వం తలపెట్టిన విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ తెలిపింది. విద్యుత్ సంస్థలను రక్షించుకొనేందుకు ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ (ఏఐఎఫ్‌ఈఈ)తో కలిసి పని చేస్తామని మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన అత్యవసర సమావేశంలో జేఏసీ నేతలు తెలిపారు. ఖైరతాబాద్‌లోని విద్యుత్‌సౌధలో మహాధర్నా తలపెట్టినట్లు ప్రకటించారు. 26న సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని ఎలక్ట్రిసిటీ ఉద్యోగులను కోరారు. సమావేశంలో టీఈఈ జాక్ నేతలు శివాజీ, ప్రకాశ్, అంజయ్య, గణేశ్, నాసర్ షరీఫ్, వినోద్‌కుమార్, జాన్సన్, ఆరోగ్యరాణి, రమేశ్, రవి, ప్రణీత తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- పురుషుల్లో ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గించండిలా..
- పోరాడిన కెప్టెన్ జో రూట్
- పీహెచ్‌సీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : మంత్రి హరీశ్‌రావు
- ప్రకృతి ఒడిలో రాశీఖన్నా కసరత్తులు..వీడియో వైరల్
- 2,752 కరోనా కేసులు.. 45 మరణాలు
- కలబంద డయాబెటిస్‌కు వరం లాంటిదా.. ఎందుకు?
- వ్యవసాయశాఖ పొలం- హలం శాఖగా మారాలి : సీఎం
- నేపాల్ ప్రధానిని బహిష్కరించిన కమ్యూనిస్ట్ పార్టీ
- హైదరాబాద్‌కు దీటుగా ఖమ్మం అభివృద్ధి
- మూడు వారాల్లోనే ‘క్రాక్’..డిజిటల్ రిలీజ్ డేట్ ఫిక్స్