బుధవారం 03 జూన్ 2020
National - May 17, 2020 , 01:24:24

రేపు నాలుగో విడుత లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు విడుదల

రేపు నాలుగో విడుత లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు విడుదల

ఢిల్లీ:  దేశవ్యాప్తంగా నాలుగో విడుత లాక్‌డౌన్‌ సోమవారం నుంచి మొదలుకానుంది. ఈ నేపథ్యంలో మార్గదర్శకాల రూపకల్పనపై కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అభిప్రాయాలను సేకరించి, వాటికనుగుణంగా మార్గదర్శకాలు రూపొందిస్తున్నది. నాలుగో విడుత లాక్‌డౌన్‌లో మరిన్ని ఆంక్షలను సడలించనున్నట్లు అధికారులు చెప్తున్నారు. వైరస్‌ ఉద్ధృతి అధికంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం కఠిన ఆంక్షలు విధించనున్నట్లు పేర్కొంటున్నారు. ఇప్పటికే వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, ఒడిశా, తెలంగాణలోని 30 ప్రాంతాలను గుర్తించినట్లు సమాచారం. దేశంలో 80 శాతం కేసులు ఈ ప్రాంతాల్లోనే నమోదవుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ 30 జోన్లలో కఠిన ఆంక్షలు విధించనున్నట్లు సమాచారం. పూర్తి మార్గదర్శకాలు ఆదివారం వెలువడే అవకాశం ఉన్నది.

ఏయే ప్రాంతాలు?

గ్రేటర్‌ ముంబై, గ్రేటర్‌ చెన్నై, అహ్మదాబాద్‌, థానే, ఢిల్లీ, ఇండోర్‌, పుణే, కోల్‌కతా, జైపూర్‌, నాసిక్‌, జోధ్‌పూర్‌, ఆగ్రా, తిరువళ్లూర్‌, ఔరంగాబాద్‌, కడలూర్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌, సూరత్‌, చెంగల్‌పట్టు, అరియాళూర్‌, హౌరా, కర్నూల్‌, భోపాల్‌, అమృత్‌సర్‌, విల్లుపురం, వడోదర, ఉదయ్‌పూర్‌, పాల్ఘర్‌, బెర్హంపూర్‌, సోలాపూర్‌, మీరట్‌

మరిన్ని సడలింపులు

నాలుగో విడుత లాక్‌డౌన్‌లో మరిన్ని ఆంక్షలను సడలించనున్నారు. గ్రీన్‌జోన్లలో పూర్తిగా ఆంక్షలను ఎత్తివేసే అవకాశం ఉన్నది. ఆరెంజ్‌ జోన్లలో పరిమిత స్థాయిలో, కంటైన్మెంట్‌ జోన్లలో మాత్రం కఠిన ఆంక్షలను అమలుచేయనున్నారు. రైల్వే, దేశీయ విమాన రాకపోకలను దశలవారీగా ప్రారంభించనున్నట్లు కేంద్ర అధికారి ఒకరు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా విద్యాసంస్థలు, మాల్స్‌, సినిమా హాళ్లను తెరిచే ప్రసక్తి లేదని స్పష్టంచేశారు. అయితే కంటైన్మెంట్‌ ప్రాంతాలు మినహా రెడ్‌జోన్లలోనూ క్షౌరశాలలు, ఆప్టికల్‌ దుకాణాలను తెరువనున్నట్లు చెప్పారు.


logo