మంగళవారం 20 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 00:52:14

నేడు భారత్‌ బంద్‌

నేడు భారత్‌ బంద్‌

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా.. 

న్యూఢిల్లీ: పార్లమెంటులో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ శుక్రవారం తలపెట్టిన భారత్‌ బంద్‌కు 25కుపైగా రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐఎఫ్‌యూ), భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ), ఆలిండియా కిసాన్‌ మహాసంఘ్‌ (ఏఐకేఎం) వంటి రైతు సంఘాలు శుక్రవారం దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలోని రైతు సంఘాలతో పాటు పదికి పైగా కేంద్ర కార్మిక సంఘాలు ఈ బంద్‌కు మద్దతు ప్రకటించాయి. 

పంజాబ్‌లో రైతుల రైల్‌ రోకో 

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ సంస్కరణల బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌ రైతుల నిరసన తీవ్రతరమైంది. మూడు రోజుల రైల్‌రోకో కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. దాంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా రైల్వే అధికారులు రాష్ట్రంలో రైళ్లను రద్దుచేశారు. 26వ తేదీ వరకు 14 జతల ప్రత్యేక రైళ్లను రద్దుచేసినట్టు ప్రకటించారు. కిసాన్‌ మజ్దూర్‌ సంఘ్‌ చేపట్టిన రైల్‌ రోకో కార్యక్రమానికి ఇతర రైతు సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. 


logo