శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 18:48:39

వీటిని మానకుంటే.. ‘కరోనా’తో సతమతమవడం ఖాయం!

వీటిని మానకుంటే.. ‘కరోనా’తో సతమతమవడం ఖాయం!

న్యూ ఢిల్లీ: కరోనా వైరస్‌ మన శ్వాసవ్యవస్థను దెబ్బతీసి, ప్రాణాలనే హరిస్తున్నదని తెలిసిన విషయమే. అయితే, ఇది కొందరిలో ఎక్కువ ప్రభావం చూపిస్తుందట. గుట్కా, సిగెరెట్‌, హుక్కా, పాన్‌మసాలా.. లాంటి పొగాకు ఉత్పత్తులకు ఎవరైతే బానిసలుగా మారారో వారికి కరోనా ముప్పు పొంచి ఉన్నట్లేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. వీటి ద్వారా శ్వాసకోశ సంబంధ అంటువ్యాధుల తీవ్రత పెరుగుతుందని, తద్వారా కొవిడ్‌ బారిన పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తంచేసింది. ధూమపానం చేసేవారిలో కొవిడ్‌ తీవ్ర ప్రభావం చూపుతుందని, వారు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారని  ‘కొవిడ్‌-19 పాండెమిక్ అండ్ టొబాకో యూజ్ ఇన్ ఇండియా' అనే పత్రంలో హెచ్చరించింది. 

ఎన్‌సీడీకి ప్రధాన కారణం..

‘ధూమపానం చేసేవారికి కొవిడ్‌-19తో ఎక్కువ ప్రమాదకరం. ఎందుకంటే వారు కలుషితమైన సిగరెట్లను చేతితో పట్టుకుని పెదవుల దగ్గరకు తీసుకెళ్తారు.. ఇలా వైరస్‌ వారి నోట్లోకి చేరే అవకాశముంది. అలాగే,  హుక్కా తాగేవారు ఒకే గొట్టాన్ని వాడుతారు. దీంతో వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది.’ అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. నాలుగు ప్రధాన నాన్-కమ్యూనికేట్ డిసీజెస్ (ఎన్‌సీడీ) అయిన హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, డయాబెటిస్‌కు పొగాకు వాడకం ప్రధాన ప్రమాద కారకమని, ఇలాంటి వ్యాధులున్నవారు కొవిడ్‌-19 బారిన పడినప్పుడు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని తెలిపింది.

దేశంలోని మొత్తం మరణాల్లో  63 శాతం ఎన్‌సీడీ వల్లే సంభవిస్తున్నాయని వివరించింది. పొగాకులోని రసాయనాలు శరీరంలోని వివిధ రకాల రోగనిరోధక కణాల చర్యను అణిచివేస్తాయని, దీంతో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని తెలిపింది. దీంతో శరీరానికి వివిధ రోగాలతో పోరాడడం కష్టమవుతుందని పేర్కొంది.  అలాగే, ధూమపానం, ఇ-సిగరెట్లు, పొగలేని పొగాకు, పాన్ మసాలా, తదితర ఉత్పత్తుల వాడకం వల్ల పల్మనరీ ఇన్ఫెక్షన్ల ప్రమాదం, తీవ్రత పెరుగుతుందని వెల్లడించింది. వివిధ దేశాల్లో సంభవించిన కరోనా మరణాలను విశ్లేషిస్తే ఇందులో ఎక్కువగా పల్మనరీ డిసీజెస్‌ (ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులు) ఉన్నవారే ఎక్కువగా ఉన్నారని వివరించింది.  

మానేస్తే కొద్దిరోజుల్లోనే ఫలితం..

పొగాకు ఉత్పత్తులను నమిలేవారు (ఖైనీ, గుట్ఖా, పాన్, జర్డా) వాటిని ఉమ్మివేస్తుంటారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం వల్ల ఆరోగ్య ప్రమాదాలు పెరుగుతాయి, ముఖ్యంగా కొవిడ్‌-19, క్షయ, స్వైన్ ఫ్లూ, ఎన్‌సెఫిలిటిస్‌లాంటి అంటు వ్యాధులు వ్యాప్తి చెందుతాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. పొగాకు ఉత్పత్తులను తీసుకోవడం మానేసిన 12గంటలలోపే రక్తప్రవాహంలోని ప్రమాదకర కార్బన్‌మోనాక్సైడ్‌ స్థాయి సాధారణ స్థితికి వస్తుందని తెలిపింది. 2-12వారాల్లో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని, ఊపిరితిత్తుల పనితీరు పెరుగుతుందని, 1-9 నెలల తర్వాత దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు తగ్గిపోతాయని వివరించింది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo