బుధవారం 27 జనవరి 2021
National - Jan 05, 2021 , 01:58:39

టీకా ఎవరికి వేస్తారు

టీకా ఎవరికి వేస్తారు

  వ్యాక్సిన్‌ ఎవరికి? ఎప్పుడు?
  ఆరోగ్య కార్యకర్తలకే ముందుగా 
  కరోనా వ్యాక్సినేషన్‌కు పకడ్బందీ విధానం
  ప్రతి దశలోనూ బాధ్యతల వర్గీకరణ
  కొ-విన్‌లో రిజిస్టర్‌ చేసుకొంటేనే టీకాలు
  రిజిస్ట్రేషన్‌ మొదలు టీకా వేసేవరకు స్పష్టమైన విధానం
  టీకా కార్యక్రమ నిర్వహణలో జిల్లా యంత్రాంగమే కీలకం

   కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాల అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇవ్వటంతో.. త్వరలోనే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి టీకా కార్యక్రమంపై పడింది. టీకాలు ముందుగా ఎవరికి వేస్తారు? ఎప్పుడు వేస్తారు? ఎక్కడ వేస్తారు? ముందుగా టీకాలు లభించేవారిలో తాము ఉంటామా? అని చర్చించుకొంటున్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఎలా ఉండబోతుందన్నదీ ఆసక్తికరంగా మారింది. టీకా కోసం కొ-విన్‌ వెబ్‌సైట్‌లో ఎలా రిజిస్టర్‌ చేసుకోవాలి? వ్యాక్సినేషన్‌ కేంద్రాల వివరాలు ఎలా తెలుసుకోవాలి? అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. వాటికి ఇప్పుడిప్పుడే జవాబులు లభిస్తున్నాయి.

   న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జనవరి 4 (నమస్తే తెలంగాణ): దేశంలో కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు అత్యవసర వినియోగానికి రెండు టీకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వటంతో దేశమంతా ఇప్పుడు వ్యాక్సినేషన్‌ గురించే చర్చించుకుంటున్నది. టీకాలు ఎవరికి వేస్తారు? ఎలా వేస్తారు? ఎక్కడ వేస్తారు?ఎప్పుడు వేస్తారు? తదితర అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొందరు కేంద్ర ప్రభుత్వ అధికారులు టీకాలు.. కొందరికే ఉచితమని చెప్తుండగా, కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ మాత్రం తొలిదశలో ఇచ్చే 3 కోట్ల మందికి ఫ్రీ అని ప్రకటించారు. ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్‌ టీకా కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాల వినియోగానికి భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఈ టీకాలు వేసుకొనేవాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నదానిపై కూడా ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయి. అసలు ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొత్తంలో ఎలాంటి దశలు ఉంటాయంటే.. 

   తెలంగాణలో తొలిదశలో ఎంత మందికి టీకా వేస్తారు?

   మొత్తం 80 లక్షల మందికి టీకా వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇందులో వైద్య సిబ్బంది, పారిశుద్ధ్యం, పోలీసులు తదితర విభాగాల సిబ్బందికి వేస్తారు. ఆ తర్వాత 50 ఏండ్లు దాటినవారికి, అనంతరం 18- 50 ఏండ్ల మధ్య వయసు ఉండి, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారికి టీకా ఇవ్వనున్నారు. చివరి దశలో మిగతా ప్రజలకు అందజేస్తారు.

   తెలంగాణకు ఎన్ని డోసుల టీకాలు వస్తున్నాయి? 

   తొలిదశలో 5 లక్షల డోసులు, ఆ తర్వాత 10 లక్షల డోసులు, ఆ తర్వాత కోటి డోసులు రానున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. మొత్తం 1.15 కోట్ల డోసులు వచ్చే అవకాశం ఉన్నది.

   రాష్ట్రంలో వ్యాక్సిన్‌ నిల్వ సామర్థ్యం ఎంత? 

   మొత్తం 3 కోట్ల డోసులను నిల్వ చేసేందుకు మన వద్ద మౌలిక సదుపాయాలు ఉన్నాయి. వ్యాక్సిన్‌ను 2- 8 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసేందుకు ఫ్రిజ్‌లు, వాహనాలను వైద్యారోగ్యశాఖ ఇప్పటికే సిద్ధంచేసింది. 

   వ్యాక్సినేషన్‌లో రాష్ర్టానికి అనుభవం ఎంత? 

   రాష్ట్రంలో ఏటా సుమారు 6 లక్షల మంది చిన్నారులకు సార్వత్రిక టీకాలు అందిస్తున్నారు. ఈ టీకాలను కూడా దాదాపు 2- 8 డిగ్రీల సాధారణ ఫ్రిజ్‌ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. కరోనా టీకాను కూడా ఇదే ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. కనుక మనకు పెద్దగా సమస్య ఉండదు. సాధారణ వ్యాక్సినేషన్‌ కోసం ఏర్పాటు చేసుకున్న నెట్‌వర్క్‌ను కొవిడ్‌ టీకాల పంపిణీకి వినియోగించుకోవచ్చు.

   ఒక వ్యక్తి ఎన్ని డోసులు వేసుకోవాలి?

   మొదటి డోస్‌ వేసిన 3, 4 వారాల్లోగా రెండో డోస్‌ వేసుకోవాలి.

   వ్యాక్సిన్‌ ప్రభావం ఎంతకాలం ఉంటుంది?

   ఇప్పుడే చెప్పలేం అందరికీ

   చేరటానికి ఎంతకాలం పడుతుంది? 

   కనీసం ఏడాది..  రెండు డోసులు చొప్పున  260 కోట్ల డోసులు కావాలి. 

   వ్యాక్సిన్‌ ఎవరికి వేస్తారు?

   కరోనా వ్యాక్సిన్‌ను ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు వేయాలని కరోనా టీకాపై నియమించిన జాతీయ నిపుణుల కమిటీ (ఎన్‌ఈజీవీఏసీ) సూచించింది. ఆ సూచనల ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో పనిచేసే ఆరోగ్య కార్యకర్తలకు ముందుగా టీకాలు వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆరోగ్య కార్యకర్తలను వారు పనిచేసే ప్రదేశాల ఆధారంగా మళ్లీ పలు విభాగాలుగా విభజించారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌, బాలల సమీకృత అభివృద్ధి కార్యక్రమం (ఐసీడీఎస్‌) కార్యకర్తలు, నర్సులు, సూపర్‌వైజర్లు, పారామెడికల్‌ సిబ్బంది, మెడికల్‌ ఆఫీజర్లు, సహాయ సిబ్బంది, వైద్య విద్యార్థులు.. ఇలా దశలవారీగా టీకాలు వేస్తారు. వీరి అందరి వివరాలను వైద్య అధికారులు సేకరించి కరోనా టీకా కోసమే కేంద్రం ప్రత్యేకంగా తయారుచేసిన కొ-విన్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తున్నారు. 

   ఫ్రంట్‌లైన్‌  వారియర్స్‌

   కేంద్ర, రాష్ర్టాల పరిధిలో పనిచేస్తున్న పోలీసులు, సాయుధ దళాలు, పౌర రక్షణ సంస్థలు, విపత్తు నిర్వహణ సిబ్బంది, హోంగార్డులు, జైళ్ల సిబ్బంది, మున్సిపల్‌ వర్కర్స్‌, కరోనా నియంత్రణ కార్యక్రమాల్లో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బందిని ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ అంటున్నారు. వీరితోపాటు రక్షణ, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖల సిబ్బందికి కూడా మొదటి దశలో టీకాలు వేస్తారు. దేశంలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ రెండు కోట్ల మంది ఉన్నారు. 50 ఏండ్ల వయసు పైబడినవారు ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ తర్వాత 50 ఏండ్ల వయసుపైబడినవారికి టీకాలు వేస్తారు. ఈ విభాగాన్ని 50 ఏండ్లు పైబడినవారు, 60 ఏండ్లు దాటినవారిగా రెండు భాగాలుగా విభజించారు. ఇటీవల చివరగా ప్రకటించిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ఓటర్‌ లిస్టుల ఆధారంగా వ్యక్తుల వయసును గుర్తిస్తారు. 2021 జనవరి 1 నాటికి 50 ఏండ్లు నిండి ఉండాలి. అంటే 1971 జనవరి 1కి ముందు జన్మించిన వారందరికీ టీకాలు వేస్తారు. అత్యధిక  కేసులు నమోదవుతున్న ప్రాంతాలు రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కడైతే అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయో.. అక్కడ ప్రజలకు తొలి విడతలో టీకాలు వేయటానికి ప్రాధాన్యం ఇస్తారు.

   మిగతా పౌరులు ప్రాధాన్యతా క్రమంలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల తర్వాత టీకాలు వేసేవారిలో 50 ఏండ్ల వయసు మించకుండా.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఉన్నారు. డయాబెటిస్‌, క్యాన్సర్‌, హైపర్‌టెన్షన్‌, ఊపిరితిత్తుల వ్యాధులు తదితర సమస్యలతో బాధపడుతున్నవారికి టీకాలు వేస్తారు. అయితే, వ్యాధి తీవ్రత, కరోనా టీకా లభ్యతను దృష్టిలో పెట్టుకొని ఈ వర్గంలో ఎవరికి టీకాలు ముందుగా వేయాలన్నది నిర్ణయిస్తారు. 

   టీకా ఉచితమేనా?

   కేంద్ర ప్రభుత్వం 3 కోట్ల మంది ప్రజలకు టీకాను ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించింది. మిగతావారు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఏమైనా రాయితీ ఇస్తుందా? లేదా? అనేది స్పష్టత ఇవ్వలేదు.

   టీకా ధర ఎంత ఉంటుంది?

   ధరలను ఇంకా నిర్ణయించలేదు. కొవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా అధినేత అధర్‌ పూనావాలా మాత్రం ఒక్కో డోస్‌ను ప్రభుత్వానికి రూ.200కు పంపిణీ చేస్తామని, బహిరంగ మార్కెట్‌లో రూ.1000కి అమ్ముతామని చెప్పారు. భారత్‌ బయోటెక్‌ ఇంకా ధరను ప్రకటించలేదు. అందుబాటు ధరలోనే టీకా ఉంటుందని గతంలో తెలిపింది.

    ఏడాదికి ఒకసారే టీకా వేసుకోవాలా? 

   టీకాతో ఏర్పడిన ప్రతిరక్షకాలు మన శరీరంలో ఎంతకాలం ఉంటాయో ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే ప్రాథమికంగా మాత్రం 9 నెలల నుంచి ఏడాది వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరో ఆరేడు నెలల్లో స్పష్టత వస్తుంది.

   టీకా కోసం ఎలా రిజిస్టర్‌ చేసుకోవాలి?

   టీకాల కోసం ప్రజలు ముందుగా రిజిస్టర్‌ చేసుకొనేందుకు కొ-విన్‌ అనే వెబ్‌సైట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. త్వరలోనే మొబైల్‌ యాప్‌ను కూడా అందుబాటులోకి తేనున్నది. ఈ రెండు మార్గాల ద్వారా సామాన్యులు నేరుగా రిజిస్టర్‌ చేసుకోవచ్చు. ముందుగా కొ-విన్‌ పోర్టల్‌ ఓపెన్‌ చేయగానే రిజిస్ట్రేషన్‌ అనే ఆప్షన్‌ వస్తుంది. అందులో ఆధార్‌ నంబర్‌ నమోదు చేయాలి. సరైన నంబర్‌ అయితే వెంటనే మీ పేరు, శాశ్వత చిరునామా తదితర వివరాలన్నీ అందులో కనిపిస్తాయి. ఆ వెంటనే ఆధార్‌ నంబర్‌తో నమోదై ఉన్న మొబైల్‌ నంబర్‌కు వన్‌ టైం పాస్‌వర్డ్‌ వస్తుంది. దానిని ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత ఫొటో గుర్తింపు కార్డును అప్‌లోడ్‌ చేయగానే రిజిస్ట్రేషన్‌ పూర్తయినట్టు చూపిస్తుంది. 

   ఆధార్‌ కార్డుపై ఉన్న చిరునామాలు లేనివారు ప్రస్తుతం నివసిస్తున్న చిరునామా, పుట్టిన తేదీలను స్వయంగా కూడా ఎంటర్‌ చేయవచ్చు. పూర్తి వివరాలు నమోదు చేసిన తర్వాత ‘డెమో అథెంటికేషన్‌' అనే ఆప్షన్‌ను ఎంపికచేసుకోవాలి. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే ఆకుపచ్చ టిక్‌తో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయినట్టు చూపిస్తుంది. 

   రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తికాగానే ఎప్పుడు? ఎక్కడ? మీకు టీకా వేస్తారు అనే వివరాలతో కూడిన సందేశం మీ మొబైల్‌ నంబర్‌కు వస్తుంది. కొ-విన్‌లో రిజిస్టర్‌ చేసుకున్నవారికి మాత్రమే టీకాలు వేస్తారు. నేరుగా టీకా కేంద్రానికి వెళ్లినా వేయరు. 

   టీకా సెషన్‌ను ఎవరు.. ఎలా నిర్ణయిస్తారు?

   ఏయే కేంద్రాల్లో టీకాలు ఎప్పుడు వేయాలి? ఎన్ని సెషన్లలో ఎంతమందికి వేయాలన్న అంశాలను జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయిస్తుంది. జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి సాయంతో కలెక్టర్‌ టీకా సెషన్‌ను ఖరారు చేస్తారు. టీకా కేంద్రాలు, టీకాలు వేసే సిబ్బంది, సూపర్‌వైజర్లు, టీకా వేసుకొనేవారు ఎవరు అనే విషయాలపై తుది నిర్ణయం కలెక్టర్‌దే. 

   టీకా కేంద్రం ఎలా ఉంటుంది?

   ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను టీకాలు వేసే సెషన్‌ సైట్‌లుగా ఉపయోగిస్తారు. మారుమూల ప్రాంతాల్లో అయితే పాఠశాలలు,  కమ్యూనిటీ హాళ్లను కూడా ఇందుకోసం వాడుకొంటారు. టీకా కేంద్రంలో మూడు గదులు ఉంటాయి. 1. వెయిటింగ్‌ రూం, 2. వ్యాక్సినేషన్‌ రూం, 3. అబ్జర్వేషన్‌ రూం. 

   వ్యాక్సిన్‌ వేసుకోవటం తప్పనిసరా? 

   వ్యాక్సిన్‌ వేసుకోవాలో.. వద్దో తేల్చుకొనే స్వేచ్ఛ ప్రజలకే ఉంటుంది. ఒకవేళ టీకా వేసుకోవాలనుకొంటే ‘కొ-విన్‌' వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 

    కొ-విన్‌లో పేరు ఎప్పుడు నమోదు చేసుకోవాలి?

   ప్రస్తుతం ఈ సాఫ్ట్‌వేర్‌లో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ వివరాలు మాత్రమే నమోదు చేస్తున్నారు. సామాన్య ప్రజల వివరాల నమోదుపై త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు. ఆ తర్వాత ఎవరికి వారు ఈ పోర్టల్‌ లేదా యాప్‌లో పేరును స్వచ్ఛందంగా నమోదు చేసుకోవాలి. దానిని బట్టి టీకా వేసే సమయాన్ని కేటాయిస్తారు.

   జ్వరం, జలుబు, దగ్గు ఉన్నవాళ్లు టీకా వేసుకోవచ్చా?

   జలుబు, దగ్గు వంటి సాధారణ లక్షణాలు ఉన్నా టీకా వేస్తారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నవారికి టీకా వేయరు. అవయవ మార్పిడి చేసుకున్నవారికి ఎప్పటికీ టీకా వేయరు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ను విడుదల చేసే సమయంలో పూర్తి మార్గదర్శకాలు అందుబాటులోకి వస్తాయి. 

   ఏ వయసువారైనా టీకా వేసుకోవచ్చా? 

   18 ఏండ్లలోపువారిపై వైరస్‌ ప్రభావం తక్కువ. కాబట్టి టీకాలు  అవసరం లేదు. ఆపై వయసున్న ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవచ్చు.

    టీకాను ఎంత ఉష్ణోగ్రతలో నిల్వచేస్తారు?

   ఫైజర్‌ సంస్థ తయారు చేసిన టీకాను మాత్రమే మైనస్‌ 75 డిగ్రీల వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ సాధారణ ఫ్రిజ్‌ టెంపరేచర్‌ (2 నుంచి 8 డిగ్రీలు) వద్ద నిల్వ చేయవచ్చు. సాధారణ వ్యాక్సిన్ల మాదిరిగానే రవాణా, నిల్వ చేస్తారు.

   గతంలో కరోనా సోకినవారు టీకా వేసుకోవాలా?

   కరోనా నుంచి కోలుకున్నవారు 90 రోజులపాటు ఎలాంటి టీకా వేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పటికే వారి శరీరంలో ప్రతిరక్షకాలు ఉంటాయి కాబట్టి వైరస్‌ సోకకుండా అడ్డుకుంటాయి. కనుక టీకా వేసుకోవాలో వద్దో వారే నిర్ణయించుకోవాలి

   సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయా?

   ఇప్పటికే అన్ని దశల క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసుకొని వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఔషధ నియంత్రణ మండలి, డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతే టీకా వినియోగానికి అనుమతి ఇచ్చాయి. కాబట్టి ఎలాంటి ఆందోళన అవసరం లేదు.

   కరోనా రోగులకే టీకా వేస్తారా?

   ఇది నిజం కాదు. కరోనా సోకకుండా అడ్డుకొనేందుకే టీకా వేస్తారు. కాబ్టటి వైరస్‌ సోకిన రోగులకు టీకా వేయరు. 


   logo