సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 17:34:41

కరోనాను గుర్తించడానికి.. డిజిటల్‌ పోర్టబుల్‌ ఎక్స్‌రే యంత్రాలు వచ్చేశాయ్‌..

కరోనాను గుర్తించడానికి.. డిజిటల్‌ పోర్టబుల్‌ ఎక్స్‌రే యంత్రాలు వచ్చేశాయ్‌..

బెంగళూరు : బెంగళూరుకు చెందిన హెల్త్‌కేర్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ కంపెనీ, ఐటీఐఈ నాలెడ్జ్ సొల్యూషన్స్, దక్షిణ కొరియాకు చెందిన హెచ్‌డీటీతో కలిసి పోర్టబుల్ ఎక్స్‌రేను అభివృద్ధి చేసింది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్ (ఏఐ)విశ్లేషణతో వ్యాధి నిర్ధారణకు, వ్యాధి సోకిన రోగుల మెరుగైన పర్యవేక్షణకు ఇది సాయపడుతుంది. 

సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. పోర్టబుల్ డిజిటల్ ఎక్స్-రే అనే యంత్రాన్ని ఛాతీపై ఉంచి కరోనా సంక్రమణ ప్రభావాన్ని స్కాన్ చేయవచ్చు. ఐటీఐఈ నాలెడ్జ్ సొల్యూషన్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ సంజీవ్ కుబాకడ్డి మాట్లాడుతూ “కోవిడ్ ఇన్ఫెక్షన్ శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది కాబట్టి స్కానింగ్ చేయడానికి మేము కనిపెట్టిన ఈపరికరం సాయపడుతుంది. ఏఐ టెక్నాలజీతో పనిచేసే ఈ డిజిటల్ ఎక్స్-రే పరికరం రోగుల న్యుమోనియా స్థాయిని సరళమైన పద్ధతిలో గుర్తిస్తుంది” అన్నారు. 


‘‘కరోనా చాలా మందికి ఊపిరితిత్తుల వద్ద ప్రాణాంతకంగా మారుతుంది. న్యుమోనియాతో మరణిస్తున్నారు. పోర్టబుల్ ఎక్స్-రే యంత్రాన్ని దవాఖానలో ఎక్కడైనా పెట్టి వాడవచ్చు. అంబులెన్సులు, ఆరుబయట కూడా ఉపయోగించవచ్చు. రోగుల్లో ఇన్ఫెక్షన్, న్యుమోనియాను సులభంగా, తక్కువ ఖర్చుతో గుర్తించడం ద్వారా ఇది వైద్యులకు సౌకర్యంగా ఉంటుంది’’ అన్నారాయన.

1.8 కిలోల బరువు ఉండే ఈ పరికరం బ్యాటరీతో పనిచేస్తుంది. ఎక్స్‌రే తీసుకున్న తర్వాత యంత్రం ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి మూడు సెకన్లలో వాట్సాప్, ఇమెయిల్ ద్వారా నివేదికను పంపుతుంది. సంస్థ ఈ పరికరాన్ని కర్ణాటక వైద్య విద్య మంత్రిత్వ శాఖకు ప్రదర్శించిందని, వారి ఆమోదం కోసం వేచి చూస్తోందని కుబాకడ్డి తెలిపారు. “యంత్రం అమ్మకం ఖర్చు సుమారు రూ .35 లక్షలు. ఇది పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత 100 ఎక్స్-రేల వరకు తీస్తుంది. ఒక ఎక్స్-రే ధర సుమారు రూ .33 అవుతుంది ” అని ఆయన చెప్పారు.

కర్ణాటక మెడికల్ కౌన్సిల్ (కేఎంసీ) సభ్యుడైన గడగ్‌కు చెందిన డాక్టర్ పవన్ పాటిల్ మాట్లాడుతూ “ఈ పరికరం చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది పోర్టబుల్ యంత్రం. దీన్ని దవాఖానలోని ఏ మూలకైనా తీసుకెళ్లి ఎక్స్‌రే తీయవచ్చు. నేను కొంతకాలంగా ఈ పరికరాన్ని ఉపయోగిస్తున్నాను. ఇది చాలా చిన్న పరికరం కాబట్టి ఎక్కడైనా పెట్టి తీసుకోవచ్చు. పరికరాన్ని ఉంచడానికి ప్రత్యేక గది అవసరం కూడా లేదు ” అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo