కోవిడ్ వ్యాక్సినేషన్‌కు ఆధార్ కార్డు మస్ట్.. లేదంటే..!

న్యూఢిల్లీ : మీ మొబైల్ నెంబర్‌ను మీ ఆధార్ కార్డుకు ఇప్పటివరకూ లింక్ చేయించకపోతే తక్షణమే ఆ పనికి పూనుకోండి. కోవిడ్ వ్యాక్సినేషన్లో ఆధార్ కార్డు కీలకం కానుంది. కోవిడ్ మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన క్రమంలో వ్యాక్సిన్ పొందేందుకు మార్గదర్శకాలను ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వైరస్‌పై ముందుండి పోరాడుతున్న ఆరోగ్య సిబ్బంది, యాభై సంవత్సరాలు పైబడిన వ్యక్తులకు తొలుత వ్యాక్సిన్ అందించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకునే వ్యక్తులు వారి మొబైల్ నెంబర్‌ను విధిగా ఆధార్‌తో లింక్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వ్యాక్సిన్ పొందే వ్యక్తిని గుర్తించడం, ఆ వ్యక్తికి ఎవరు..ఏ సమయంలో..ఎక్కడ వ్యాక్సిన్ వేశారనే సమాచారాన్నిడిజిటల్ రికార్డుల్లో నిక్షిప్తం చేసేందుకు ఈ నిబంధన తప్పనిసరని కోవిడ్-19పై ఏర్పాటైన సాంకేతిక, డేటా నిర్వహణ సాధికార గ్రూపు చైర్మన్ ఆర్ఎస్ శర్మ వెల్లడించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో వ్యక్తుల మొబైల్ నెంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయడం ద్వారా డేటా సురక్షితంగా ఉండటంతో పాటు ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పారు. కోవిన్ యాప్‌లో పలువురు ఇప్పటికే తమ ఆధార్ నెంబర్‌ను అందచేస్తున్నారని, వ్యాక్సిన్ తీసుకునే సమయంలోనూ తమతో పాటు ఆధార్ కార్డును తీసుకురావాలని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆధార్‌ను విస్తృతంగా వాడుతున్నారని, ఇక ఓటరు గుర్తింపు కార్డుల వంటి ఇతర ఐడీ ధ్రువపత్రాలనూ అనుమతిస్తామని అధికారులు తెలిపారు.