గురువారం 03 డిసెంబర్ 2020
National - Oct 31, 2020 , 18:05:46

లవ్ జిహాద్‌ను అరికట్టేందుకు చట్టం : సీఎం యోగి ఆదిత్యనాథ్

లవ్ జిహాద్‌ను అరికట్టేందుకు చట్టం : సీఎం యోగి ఆదిత్యనాథ్

న్యూఢిల్లీ : లవ్‌ జిహాద్‌ను అరికట్టేందుకు తమ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానున్నదని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చెప్పారు. వివాహానికి మత మార్పిడి అవసరం లేదని అలహాబాద్ హైకోర్టు చెప్పిన ఒక రోజు తర్వాత.. యోగి కొత్త చట్టం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకున్నది. గుర్తింపును దాచిపెట్టి హిందూ మహిళల గౌరవంతో ఆడుకునేవారు ఇకపై తమ మార్గాలను చక్కదిద్దుకోవాలన్నారు. అలా కుదరనిపక్షంలో వారి 'రామ్ నామ్ సత్య' ప్రయాణం ప్రారంభమవుతుందని యోగి హెచ్చరించారు.

కేవలం వివాహ ప్రయోజనం కోసం మతం మార్చడం చట్టబద్ధం కాదని అలహాబాద్ హైకోర్టు శుక్రవారం అభిప్రాయపడింది. రెండు వేర్వేరు మతాల అభ్యర్ధనను కొట్టివేస్తూ.. వారి స్టేట్మెంట్లను నమోదు చేయడానికి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. నూర్జహాన్‌ బేగం కేసులో ఖురాన్‌ హదీసులను ఉదహరించిన కోర్టు.. నమ్మకం లేకుండా మతాన్ని మార్చలేమని పేర్కొన్నది. నికితా తోమర్ పగటి దారుణహత్య తర్వాత 'లవ్ జిహాద్' పై చర్చ తీవ్రమైంది. నిందితుడు తౌసెఫ్.. ఆమెను ఇస్లాం మతంలోకి మారమని ఒత్తిడి చేస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. తనతో స్నేహం చేసుకోవటానికి అవరోధంగా నిలిచినందున తన గుర్తింపు గురించి అతడు నికితా తోమర్‌కు అబద్ధం చెప్పాడని ఫిర్యాదులో యువతి తల్లిదండ్రులు తెలిపారు. లవ్‌ జిహాద్, మత మార్పిడులు, హిందువులపై దారుణ సంఘటనలపై వీహెచ్‌పీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. లవ్ జిహాద్ పేరుతో జరుగుతున్న మత మార్పిడులకు వ్యతిరేకంగా సమర్థమైన చట్టాన్ని తేవాలని వీహెచ్‌పీ డిమాండ్ చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.