బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 16, 2020 , 18:45:01

'బీసీజీ' సార్థ‌క‌త‌పై త‌మిళ‌నాడు అధ్య‌య‌నం

'బీసీజీ' సార్థ‌క‌త‌పై త‌మిళ‌నాడు అధ్య‌య‌నం

చెన్నై: వ‌య‌సు మ‌ళ్లినవారిలో క‌రోనా వైర‌స్ సంక్ర‌మ‌ణను, క‌రోనా మ‌ర‌ణాల రేటును త‌గ్గించ‌డంలో బీసీజీ టీకా సార్థ‌క‌త ఎంత అనే విష‌యంలో అధ్య‌య‌నం చేయ‌నున్న‌ట్లు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం తెలిపింది. ఈ మేర‌కు బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుదల చేసింది. కాగా, బీసీజీ వ్యాక్సిన్‌ను క్ష‌య వ్యాధి సోక‌కుండా రోగనిరోధ‌క శ‌క్తిని పెంచ‌డం కోసం అభివృద్ధి చేశారు. ప్ర‌స్తుతం క‌రోనా కేసులు విప‌రీతంగా పెరిగిపోతుండ‌టంతో.. క‌రోనా క‌ట్టడిలో ఆ టీకా సామ‌ర్థ్యం ఎంతో తెలుసుకోవాల‌ని త‌మిళ‌నాడు స‌ర్కారు నిర్ణ‌యించింది. 

ఈ మేర‌కు చెన్నైలోని ది నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిసెర్చ్ ఇన్ ట్యూబ‌ర్క్యులోసిస్ (NIRT) క‌రోనా వైర‌స్‌పై బీసీజీ వ్యాక్సిన్‌ ట్ర‌య‌ల్స్ కోసం ది ఇండియ‌న్ కౌన్సిల్‌ ఆఫ్ మెడిక‌ల్ రిసెర్చ్ (ICMR) అనుమ‌తి తీసుకోనుంది. త‌మిళ‌నాడు ఆరోగ్య‌శాఖ మంత్రి సీ విజ‌య‌భాస్క‌ర్ త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. 60 నుంచి 95 ఏండ్ల మ‌ధ్య వ‌య‌సు క‌లిగిన వారిలో క‌రోనా వైర‌స్ సంక్ర‌మ‌ణ‌ను, క‌రోనా మ‌ర‌ణాల రేటును తగ్గించ‌డంలో బీసీజీ తోడ్ప‌డే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

పెద్ద‌వాళ్ల‌కు క‌రోనా వైర‌స్ సుల‌భంగా సంక్ర‌మిస్తున్న నేప‌థ్యంలో బీసీజీకి క‌రోనా వైర‌స్‌తో పోరాడ‌గ‌ల‌, వృద్ధులు ఆస్ప‌త్రిలో చేరాల్సిన అవ‌స‌రాన్ని త‌ప్పించ‌గ‌ల సామ‌ర్థ్యం ఎంత ఉందో తెలుసుకోవ‌డానికి అధ్య‌య‌నం చేయ‌డం చాలా ముఖ్యమ‌ని త‌మిళ‌నాడు ఆరోగ్య‌మంత్రి అన్నారు. క‌రోనా క‌ట్ట‌డికి మ‌రో వ్యాక్సిన్ ఏది ఇప్ప‌టివ‌ర‌కు అందుబాటులోకి రాక‌పోవ‌డంతో బీసీజీ సార్థ‌క‌తపై అధ్య‌య‌నం చేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింద‌ని ఆయ‌న అన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo