చెన్నై, మార్చి 25: ఇంటికో హెలికాప్టర్, బ్యాంకు ఖాతాలో ఏడాదికి కోటి రూపాయలు, పెండ్లి అయితే బంగారు నగలు, మూడంతస్తుల ఇల్లు, ఇంట్లో పనిచేయడానికి రోబో, చంద్రమండలం మీదకు ఉచితంగా ట్రిప్.. ఓ వ్యక్తి తన జీవితంలో ఏం చేయాలనుకొంటున్నాడో.. ఏం కావాలని కోరుకొంటున్నాడో చెప్పే కలల జాబితా కాదు ఇది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ మదురై నుంచి పోటీ చేస్తున్న శరవణన్ ఇస్తున్న ఎన్నికల హామీలివి. ఇన్ని హామీలు ఇచ్చిన శరవణన్ తన నామినేషన్ సమయంలో డిపాజిట్ కోసం అప్పు చేశారు. అయితే ఈ హామీలతో అందరి దృష్టి అతనిపై పడింది. రాజకీయ పార్టీలు అడ్డగోలుగా ఇచ్చే హామీలపై ప్రజలకు అవగాహన కల్పించడానికే తాను వింత హామీలు ఇచ్చినట్టు శరవణన్ చెప్పాడు.
గెలిపిస్తే మోకాళ్ల ఆపరేషన్ ఫ్రీ!
సీకే సరస్వతి ఒక డాక్టర్. ఆమె వయస్సు 76 ఏండ్లు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. మొదకురుచ్చి నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. తనను గెలిపిస్తే ఉచితంగా మోకాలి శస్త్రచికిత్స అవసరమైన వారికి ఉచితంగా వైద్యం చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు.
డీఎంకే నేత ఇండ్లలో ఐటీ సోదాలు
తమిళనాడులో డీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి ఈవీ వేలు ఇండ్లపై గురువారం ఏకకాలంలో ఐటీదాడులు జరిగాయి. పన్ను ఎగవేత అనుమానంతో తిరువన్నమళై జిల్లాలోని వేలు ఆస్తులకు సంబంధించిన పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.