మంగళవారం 19 జనవరి 2021
National - Dec 17, 2020 , 02:42:41

మమతకు అసమ్మతి సెగ!

మమతకు అసమ్మతి సెగ!

  • ఎమ్మెల్యే పదవికి సువేందు అధికారి రాజీనామా 
  • బెంగాల్‌లో గళం విప్పుతున్న అసంతృప్త నేతలు 
  • బీజేపీలో చేరాలని తృణమూల్‌ నేతలపై ఒత్తిడి 
  • డబ్బు సంచులతో బీజేపీ రాజకీయం: మమత
  • తృణమూల్‌కు వంద సీట్లు కూడా రావు: రాయ్‌ 
  • వచ్చే ఏడాది బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అధికార పక్షమైన తృణమూల్‌ కాంగ్రెస్‌లో అసమ్మతి సెగ రాజుకుంటున్నది. తృణమూల్‌ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీపై పలువురు నాయకులు నిరసన గళం వినిపిస్తున్నారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, అవినీతి పెచ్చరిల్లుతున్నా నాయకత్వం పట్టించుకోవడం లేదని అసమ్మతి నేతలు విమర్శిస్తున్నారు. పార్టీలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని వారు బాహాటంగానే చెబుతున్నారు. మరోవైపు తృణమూల్‌ ముఖ్య నేతలకు బీజేపీ గేలం వేస్తున్నది. తృణమూల్‌లో మమతా బెనర్జీ తర్వాతి స్థానంలో ఉన్న నాయకుడిగా పేరున్న సువేందు అధికారి బుధవారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మమతతో తీవ్రంగా విభేదించిన ఆయన గత నెలలో మంత్రి పదవిని వదిలేశారు. 

అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేయడంతో ఆయన బీజేపీలో చేరుతారన్న ప్రచారానికి మరింత ఊతమిస్తున్నది. నందిగ్రామ్‌ ఆయన నియోజకవర్గం. తృణమూల్‌ విజయానికి, మమతా బెనర్జీ అధికారంలోకి రావడానికి కారణమైన 2009 నాటి నందిగ్రామ్‌ ఉద్యమాన్ని సువేందు అధికారి ముందుండి నడిపించారు. ప్రస్తుతం సువేందు పార్టీని వీడనున్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా తృణమూల్‌ సీనియర్‌ ఎంపీ సునీల్‌ మండల్‌, అసన్‌సోల్‌ మేయర్‌ జితేంద్ర తివారీ గొంతు విప్పారు. ప్రజా బలం ఉన్న సువేందు పార్టీని వీడితే ఎన్నికల్లో తృణమూల్‌ దెబ్బతింటుందని మండల్‌ హెచ్చరించారు. మరోవైపు, వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకు తృణమూల్‌కు 100 కూడా రావని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్‌ రాయ్‌ అన్నారు. తృణమూల్‌లో నంబర్‌ 2 నాయకుడిగా వెలిగిన ఆయన 2017లోనే బీజేపీలో చేరారు. బెంగాల్‌లో కనీసం 200 సీట్లు గెలవాలని బీజేపీ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కోరుకుంటున్నారని కార్యకర్తల సమావేశంలో ఆయన చెప్పారు. 

తృణమూల్‌ రాష్ట్ర అధ్యక్షుడిపైనా ఒత్తిడి

బీజేపీలో చేరాలని తృణమూల్‌ నేతలను కాషాయ శిబిరం బలవంతం చేస్తున్నదని మమతా బెనర్జీ ఆరోపించారు. బుధవారం కూచ్‌బిహార్‌లో జరిగిన సభలో ఆమె ప్రసంగించారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రత బక్షికి బీజేపీ నాయకులు ఫోన్‌ చేసి వారి పార్టీలో చేరమని ఒత్తిడి చేస్తున్నారని ఆమె చెప్పారు. డబ్బు సంచులతో తృణమూల్‌ను దెబ్బతీయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తృణమూల్‌ను తక్కువ చేసిన మాట్లాడుతున్న పార్టీ నాయకులు అవకాశవాదులని విమర్శించారు.