బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 29, 2020 , 21:16:54

దుర్గాదేవిగా నుస్రత్‌ జహాన్‌ : పలువురి నుంచి బెదిరింపులు

దుర్గాదేవిగా నుస్రత్‌ జహాన్‌ : పలువురి నుంచి బెదిరింపులు

కోల్‌కతా : దుర్గాదేవిగా మేకప్‌ చేసుకున్న ఫొటోలను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటి నుస్రత్ జహాన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆమెకు చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఆమె తన న్యాయవాదుల బృందానికి తెలియజేసింది. అదేవిధంగా రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు భద్రత ఇవ్వాలని  విజ్ఞప్తిచేశారు.

నుస్రత్ జహాన్ ఇటీవల ఒక వీడియోతోపాటు కొన్ని చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. అందులో ఆమె చేతిలో త్రిశూల్‌ ధరించి దుర్గాదేవిగా మేకప్‌ చేసుకుని కనిపించారు. ఈ వీడియోను ఒక వస్త్రాల తయారీ సంస్థ ప్రకటన కోసం ఫొటోషూట్‌ చేసిన దాని నుంచి తీసుకున్నారు. ముస్లిం మహిళగా ఉండి హిందూ దేవతగా నటిస్తున్నందుకు భారతదేశంతోపాటు బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు ఆమెను బెదిరిస్తూ కామెంట్స్‌ చేశారు. ఒక ఫిల్మ్ షూటింగ్‌ కోసం లండన్‌కు బయలుదేరిన నుస్రత్‌ జహాన్‌.. లండన్‌లో బస చేసినందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి అదనపు భద్రత కోరింది. ఆమె తిరిగి రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆమెకు మరింత భద్రత కల్పించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది. "మేము ఈ విషయాన్ని బెంగాల్ ప్రభుత్వం, విదేశాంగ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లాం. వారు రక్షణ కోసం లండన్‌లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుంటున్నారు" అని నుస్రత్‌ జహాన్‌ ముఖ్య అనుచరుడు ఒకరు తెలిపారు. నుస్రత్ జహాన్ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ కావడం ఇదే మొదటిసారి కాదు. హిందూ వ్యక్తిని వివాహం చేసుకోవడం, సిందూర్ ధరించడం, రథయాత్రలో పాల్గొన్నందుకు ఆమెను ట్రోల్ చేసి బెదిరించారు.


logo