సోమవారం 30 నవంబర్ 2020
National - Aug 29, 2020 , 00:52:11

ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను కరోనా నేపథ్యంలో ఏకాంతంగా చేపట్టనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్‌లో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది అధికమాసం ఉన్నందున బ్రహ్మోత్సవాలను రెండుసార్లు నిర్వహించనున్నట్టు తెలిపారు. వాహనసేవలను మాడవీధుల్లో నిర్వహించడం లేదన్నారు. సెప్టెంబర్‌ 19 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తామని తెలిపారు. అక్టోబర్‌ 16న నిర్వహించే బ్రహ్మోత్సవాలను అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామని స్పష్టంచేశారు. శనివారం నుంచి 3 వేల ఉచిత టోకెన్లను జారీచేస్తామన్నారు. బర్డు దవాఖానలో గదుల నిర్మాణానికి రూ.5.5 కోట్లు, విశాఖలోని ఆలయానికి రోడ్డు కోసం రూ.4.5 కోట్లు కేటాయించామని వివరించారు. టీటీడీ ఉద్యోగులకు ఆరోగ్యక్షశ్రీ వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖరాశామన్నారు. బ్యాంకుల్లో శ్రీవారి బంగారాన్ని నగదును స్వల్పకా లికంగా డిపాజిట్‌ చేయడంవల్ల వడ్డీ తక్కువ వస్తుందని, దీర్ఘకాలికంగా పెడితే లాభం ఉంటుందని బోర్డు సభ్యుడు జూపల్లి రామేశ్వర్‌రావు చేసిన సూచనను చైర్మన్‌ ప్రశంసిం చారు. ఇకపై 12 ఏండ్ల కాలానికి డిపాజిట్లు చేస్తామన్నారు. తిరుమలలో సాలిడ్‌వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో కొత్త టెక్నాలజీ అభివృద్ధి కోసం బోర్డు సభ్యురాలు సుధానారాయణమూర్తి రూ. కోటి విరాళం ప్రకటించారు. సమావేశంలో పాలకమండలి సభ్యులు దీవకొండ దామోదర్‌రావు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వీ ప్రశాంతిరెడ్డి, నిశ్చిత, టీటీడీ ఈవో ఏకే సింఘాల్‌ పాల్గొన్నారు.