సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 14, 2020 , 19:39:57

కరోనా అలర్ట్‌... టీటీడీ సంచలన నిర్ణయాలు

కరోనా అలర్ట్‌... టీటీడీ సంచలన నిర్ణయాలు

తిరుమల : ప్రమాదకర కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నివారణకు భక్తులు వేచి ఉండే పద్దతికి తాత్కాలికంగా స్వస్తి పలికింది. టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే టోకెన్లు కేటాయించి భక్తులను దర్శనానికి పంపాలని టీటీడీ నిర్ణయించింది. కంపార్ట్‌మెంట్లులో వేచి ఉంటే కరోనా వ్యాప్తి చెందే అవకాశముండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.  

ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల‌లో భాగంగా ఏప్రిల్ 7వ తేదీన నిర్వ‌హించ‌వ‌ల‌సిన శ్రీ సీతా రామూల క‌ల్యాణంను ఆల‌యం వెలుప‌ల ర‌ద్ధు చేసి గ‌తంలో వ‌లే ఆల‌యం లోప‌ల నిర్వ‌హిస్తార‌న్నారు.  కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణ భూమిపూజను వాయిదా వేసింది. అలాగే కరోనా నివారణను కోరుతూ.. శ్రీశ్రీనివాస శాంతి ఉత్సవ సహిత ధన్వంతరి మహాయాగంను నిర్వహించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. మరోవైపు విశేషపూజ, సహస్త్ర దీపాలంకరణ సేవ, వసంతోత్సవం సేవలను ముందుగా బుక్ చేసుకున్న భక్తులకు తేది మార్చుకునే అవకాశం, లేదా బ్రేక్ దర్శనంకు వెళ్లే వెసులుబాటును టీటీడీ కల్పించింది. 

కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది ఒకేచోట గుమికూడటం మంచిదికాదని భావించిన టీటీడీ ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుందని ఈ మేరకు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వివరాలను వెల్లడించారు. ‘దేశ, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోంది. వైరస్‌ వ్యాప్తి కాకుండా నిరంతరం చర్యలు చేపడుతున్నాం. ఎక్కువ మంది ఒకేచోట గుమికూడటం మంచిది కాదు. దీని వల్ల త్వరగా వైరస్ వ్యాపిస్తుంది. తిరుమలని సెక్టార్ లుగా విభజించి, శుభ్రత చర్యలు చేపట్టాము. 

గదులు కాళీ చేసిన వెంటనే పూర్తిగా సుద్ది చేసిన తర్వాత మరొకరికి కేటాయిస్తున్నాము. అనుమానితులను అలిపిరి, నడకదారిలో గుర్తించి వైద్య చికిత్సకోసం తరలించే ఏర్పాటు చేశాం. కరోనా వైరస్ ప్రభావితం వల్లా ఒకే చోట ఆరు గంటలు ఉండటం మంచిది కాదు.  మంగళవారం నుంచి టీటీడీ కేటాయించే సమయంలో మాత్రమే దర్శనానికి రావాలి. భక్తులు కూడా సహకరించాలి’ అని తెలిపారు.

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు మార్చి 17వ తేదీ మంగ‌ళ‌వారం నుంచి టైంస్లాట్ టోకెన్లు జారీ చేయడం ద్వారా యాత్రికులను నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్న‌ట్లు తెలిపారు. భ‌క్తుల సౌక‌ర్యార్థం తిరుమల, తిరుపతిల‌లో టైమ్ స్లాట్లు టోకెన్లు ఇవ్వడానికి కౌంటర్లు అందుబాటులోనికి  తెస్తామ‌న్నారు.  టైంస్లాట్ టోకెన్లు తీసుకునే భ‌క్తులు త‌ప్ప‌నిస‌రిగా ఆధార్ , ఒట‌ర్ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌ కార్డు లేదా పాస్‌పోర్టు  వంటి ఏదేని గుర్తింపు కార్డున్ని తీసుకురావాల‌న్నారు. భ‌క్తులు త‌మ‌కు కేటాయించిన స‌మాయానికి ద‌ర్శ‌నానికి వ‌చ్చి టీటీడీకి స‌హ‌క‌రించాల‌ని కోరారు. 

విశేష‌ పూజ, సహస్ర కలశాభిషేకం మరియు వసంతోత్సవం సేవ‌ల‌ను ముంద‌స్తుగా పొంది, ఆర్జిత సేవ‌ల‌ ర‌ద్దు కార‌ణంగా వారికి టీటీడీ అద‌న‌పు ఈవో కార్యాల‌యంలో సంప్ర‌దిస్తే వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నం కేటాయిస్తార‌న్నారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాలతోపాటు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్, కళ్యాణకట్ట, అన్నప్రసాద భవనం తదితర ప్రాంతాల్లో థర్మల్ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంద‌న్నారు. భ‌క్తులు ఎక్కువ‌గా ఉండే పిఏసిలు, అన్న‌ప్ర‌సాదం కాంప్లెక్స్‌, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, క‌ల్యాణ‌క‌ట్ట, సేవాస‌ద‌న్‌ త‌దిత‌ర ప్రాంతాల్లో ప్ర‌తి 2 గంట‌ల‌కోసారి ప‌రిశుభ్ర‌త(శానిటైజ్‌) చ‌ర్య‌లు చేపడుతున్నామని తెలిపారు. 

వ‌స‌తి గ‌దులను భ‌క్తులు ఖాళీ చేసిన త‌రువాత ఒక గంట పాటు స‌రైన విధంగా శుభ్రం చేసిన త‌రువాత మ‌రొక‌రికి కేటాయిస్తాం. తిరుమల లోని ఆరోగ్య విభాగం కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు. ఇది 24 గంటలపాటు పని చేస్తుంది.  యాత్రికులు 0877 - 2263447  నంబరుకు ఫోన్ చేసి కరోనా వ్యాప్తి  నివారణ చర్యలను తెలుసుకోవచ్చు.  కరోనా వ్యాధి వ్యాప్తి నివారణ చర్యలపై ఇప్పటికే టీటీడీలోని అన్ని విభాగాల అధికారులకు అవగాహన కల్పించడం జరిగింది. అధికారులు ఆయా విభాగాల సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. అలిపిరి వద్ద యాత్రికులకు కరోనా వ్యాధి ల‌క్ష‌ణాల‌ను ప్రాథ‌మికంగా గుర్తిస్తే తిరుమ‌ల‌కు అనుమ‌తించ‌కుండా రుయా ఆసుప‌త్రిలోని ఐసోలేష‌న్ వార్డుకు పంపేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. స‌మావేశంలో టీటీడీ ఆరోగ్య విభాగాధికారి డా.ఆర్‌.ఆర్‌.రెడ్డి, శ్రీ‌వారి ఆల‌య డిప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. 


logo