సోమవారం 30 మార్చి 2020
National - Feb 20, 2020 , 11:07:28

శ్రుతిమించిన విశ్వాసాలు.. భార్యను చంపి భర్త ఆత్మహత్య

శ్రుతిమించిన విశ్వాసాలు.. భార్యను చంపి భర్త ఆత్మహత్య

బెంగళూరు : ఆమెకు కులమతాలపై విశ్వాసాలు ఎక్కువ. శుచి, శుభత్రకు ఆమె మారుపేరు. ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండాలని కోరుకుంటుంది. భర్త, పిల్లలు బయటి నుంచి ఇంట్లోకి వస్తే కచ్చితంగా స్నానం చేయాల్సిందే. భార్య పద్ధతులు భరించలేక భర్తే ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మైసూర్‌ జిల్లాలోని మండహళ్లిలో మంగళవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే శాంతమూర్తి(40), పుట్టమణి(38) దంపతులకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అయితే పెళ్లి అయినప్పటి నుంచి పుట్టమణి శుచి, శుభ్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఆమెకు కులమతాలపై విశ్వాసం ఎక్కువ ఉండడంతో.. తూచా తప్పకుండా పద్దతులు పాటించేది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లి.. మళ్లీ తిరిగి ఇంటికొచ్చిన తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి. ఇలా రోజుకు భర్తతో పాటు పిల్లలు కనీసం పదిసార్లు అయినా స్నానం చేయాల్సి వచ్చేది. అంతే కాదు పిల్లల స్కూల్‌ బ్యాగులకు కూడా ఆమె సాయంత్రం వేళ ప్రోక్షణ చేసేది. ఇక తన భర్త తెచ్చే కరెన్సీ నోట్లను కూడా కడిగి ఆరబెట్టేది. దీంతో ఈ మధ్య కాలంలో పుట్టమణి విశ్వాసాలు శ్రుతి మించడంతో.. భర్త విసుగు చెందాడు. మంగళవారం పొలం వద్దకు తీసుకెళ్లి కొడవలితో ఆమెను నరికి చంపాడు. ఆ తర్వాత తాను ఇంటికొచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఈ ఘటనపై ప్రభు స్వామి అనే స్థానికుడు స్పందించాడు. పుట్టమణి లాంటి మహిళను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదు. గత ఎనిమిదేళ్ల నుంచి ఆమెకు విశ్వాసాలు ఎక్కువ అయ్యాయి. ఆమె ఇంట్లోకి అడుగుపెట్టాలంటే తమకు భయమేసేది. ఎందుకంటే ఇంట్లోకి అడుగుపెట్టాలంటే కచ్చితంగా స్నానం చేయాలని పుట్టమణి డిమాండ్‌ చేసేది అని ఆయన తెలిపాడు. 

పుట్టమణి బంధువు రాజశేఖర్‌ స్పందిస్తూ.. భర్త తీసుకువచ్చే కరెన్సీ నోట్లను కూడా ఆమె కడిగి ఆరబెట్టేది. ఎందుకంటే.. అవి ఏ కులానికి, మతానికి చెందిన వారో ఇచ్చారనే అనుమానం పుట్టమణికి ఉండేది. కుల, మత విశ్వాసాల మీద ఆమెకున్న నమ్మకంతో ఇంట్లో వారందరిని విసిగిస్తూ ఉండేదని రాజశేఖర్‌ చెప్పాడు. టాయిలెట్‌కు వెళ్లినా కూడా స్నానం చేయాలని ఆమె డిమాండ్‌ చేసేదన్నారు రాజశేఖర్‌. 

అయితే మంగళవారం ఉదయం పుట్టమణి, శాంతమూర్తికి మధ్య గొడవ జరిగిందని ప్రభుస్వామి తెలిపాడు. వరి ధాన్యం అమ్ముకొచ్చి వచ్చిన డబ్బులను భార్యకు ఇచ్చాడు. అయితే ఆ డబ్బులను ఆమె కడిగి ఆరబెట్టింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య గొడవ మొదలైంది అని ప్రభు పేర్కొన్నాడు. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శాంతమూర్తి ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని ఆయన తెలిపాడు.


logo