బుధవారం 15 జూలై 2020
National - Jun 28, 2020 , 16:41:33

'రాజకీయాలు కాదు.. చైనాను ఎలా ఎదుర్కోవాలో ఆలోచిద్దాం'

'రాజకీయాలు కాదు.. చైనాను ఎలా ఎదుర్కోవాలో ఆలోచిద్దాం'

ముంబై: రాజకీయ పార్టీలన్నీ తమ శత్రుత్వాన్ని మరిచిపోయి, చైనాను ఎదుర్కోవాల్సిన అంశంపై మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందని శివసేన పార్టీ పేర్కొంది. చైనా నుంచి కాంగ్రెస్‌ పార్టీ డబ్బులు తీసుకున్నది అని బీజేపీ చేసిన ఆరోపణలనుద్దేశించి శివసేన ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు తన పత్రిక సామ్నాలో సంపాదకీయం రాసింది. ‘చైనా గాల్వన్ లోయలో కొత్త నిర్మాణాన్ని ప్రారంభించింది. చైనా సైనికులు అరుణాచల్, సిక్కిం ద్వారా మన భూభాగంలోకి వస్తున్నారు. అందువల్ల రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు తమ శత్రుత్వాన్ని వీడి, చైనాను ఎలా ఎదుర్కోవాలి? అనే అంశంపై మాట్లాడాలి’ అని పేర్కొంది. 

చైనా విధానం గురించి మాట్లాడుతూ.. ‘చైనా నిరంతరం చేపడుతున్న చర్యలు భారత్‌కు తలనొప్పిగా మారాయి. అది ఒకటి చెప్పి మరోటి చేస్తున్నది. ఇదే ఆ దేశపు పాలసీలాగా కనిపిస్తున్నది. అది భారత్‌తో యుద్ధం చేయాలని కోరుకోవడం లేదు. కానీ యుద్ధంలాంటి పరిస్థితులు కల్పించి, సరిహద్దుల్లోనే ఇండియా తలమునకలయ్యేలా చేస్తోంది.’ అని వ్యాఖ్యానించింది. అలాగే,  చైనా తన దళాలు, వాహనాలను గాల్వన్ వ్యాలీ నుంచి ఉపసంహరించుకుంటుందని, అయితే, అదే సమయంలో ఆ దేశ సైన్యం లడఖ్‌లోని డెప్సాంగ్ సెక్టార్లో కొత్త గుడారాలను ఏర్పాటు చేసిందని,  కెనాన్స్‌, ట్యాంకులను మోహరించిందని శివసేన పేర్కొంది. అంటే చైనా మన సరిహద్దుల్లోనుంచి వెనక్కి వెళ్లాలని అనుకోవడంలేదని, నిరంతరం యుద్ధ పరిస్థితులు సృష్టించాలని చూస్తున్నదని తన సంపాదకీయంలో రాసింది.  


logo