శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 16:16:02

టైమ్ క్యాప్సూల్.. ఇదే మొదటిసారి కాదు!

టైమ్ క్యాప్సూల్.. ఇదే మొదటిసారి కాదు!

న్యూఢిల్లీ : అయోధ్యలో శ్రీరాముడి ఆలయం భూమిపూజ సమయంలో టైమ్ క్యాప్సూల్ చర్చనీయాంశమైంది. టైమ్ క్యాప్సూల్ (కాల నాళిక‌) ఏర్పాటు చేస్తున్న‌ట్లుగా మీడియాలో వ‌చ్చిన వార్త‌లు అవాస్త‌వ‌మ‌ని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చంపత్ రాయ్ తెలిపారు. మరోవైపు రామాలయం క్రింద టైమ్ క్యాప్సూల్ నిక్షిప్తం చేస్తామని, అందువల్ల దీనికి సంబంధించిన వాస్తవాలపై ఎటువంటి వివాదం ఉండదని రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ అన్నారు. అసలింతకీ టైమ్ క్యాప్సూల్ అంటే ఏమిటి..? దీనిని గతంలో కూడా ఎక్కడైనా చేపట్టారా..?  టైమ్ క్యాప్సూల్ లో ఏఏ సమాచారం ఉంటుంది? 

మొదటి క్యాప్సూల్‌ కల్పత్రా  

టైమ్ క్యాప్సూల్ భూమిలో నిక్షిప్తం చేయడం అనేది దేశంలో మొదటిసారి జరుగడం లేదని జేఎన్‌యూ ప్రొఫెసర్ ఆనంద్ రంగనాథన్ ఫొటోను ట్వీట్ చేశారు. 1973 ఆగస్టు 15 న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎర్రకోట సమీపంలోని మైదానంలో టైమ్ క్యాప్సూల్ నిక్షిప్తం చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ టైమ్ క్యాప్సూల్లో ఏ సమాచారాన్ని పెట్టారనే విషయం ఎవరికీ తెలియదు. ఎర్రకోట ప్రాంగణంలో పాతిపెట్టిన టైమ్ క్యాప్సూల్‌కు 'కల్పత్రా' అనే పేరును ఇందిరాగాంధే పెట్టినట్లు చరిత్రకారులు చెప్తున్నారు.

స్వాతంత్య్రానంతర 25 సంవత్సరాల పరిణామాలకు సాక్ష్యాలతో ఇందిరా గాంధీ టైమ్ క్యాప్సూల్‌ను భూమిలో నిక్షిప్తం చేశారని, ఇందుకోసం ఆమె ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ఐసీహెచ్ఆర్) కు గతంలోని ముఖ్యమైన సంఘటనలను పంపించిందని పలు నివేదికలు పేర్కొన్నాయి. 1970 తరువాత కాంగ్రెస్ అధికారం నుంచి దిగిపోయి.. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఏర్పడింది. అప్పుటి ఎన్నికలలో వాగ్దానం చేసినట్లుగా ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల తరువాత టైమ్ క్యాప్సూల్ ను తవ్వితీశారు. అయితే టైమ్ క్యాప్సూల్లో ఏం నిక్షిప్తం చేశారో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం వెల్లడించలేదు. దాంతో ఇందిరాగాంధీ ఎర్రకోట ప్రాంగణంలో పాతిపెట్టిన టైమ్ క్యాప్సూల్‌లో ఏం పేర్కొన్నారనేది ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉండిపోయింది.


టైమ్ క్యాప్సూల్ అంటే..

టైమ్ క్యాప్సూల్ ఒక కంటైనర్ లాంటిది. ఇది ప్రత్యేక అంశాలతో తయారు చేయబడింది. టైమ్ క్యాప్సూల్ అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకోగలదు. టైమ్ క్యాప్సూల్ భూమి లోపల తగినంత లోతుగా నిక్షిప్తం చేస్తారు. తగినంత లోతులో ఉండటం వల్ల వేల సంవత్సరాలుగా ఎటువంటి హాని కలుగకుండా ఉంటుంది. క్యాప్సూల్ ను పూడ్చడం యొక్క ఉద్దేశ్యం.. సమాజం, కాలం, దేశం యొక్క చరిత్రను కాపాడటం. ఇది భవిష్యత్ ప్రజలతో ఒక విధంగా పరిచయం చేసుకునే ప్రయత్నంగా చెప్పవచ్చు. 


logo