గురువారం 26 నవంబర్ 2020
National - Nov 09, 2020 , 15:59:58

రేపే బీహార్ అసెంబ్లీ ఫ‌లితాలు.. భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం

రేపే బీహార్ అసెంబ్లీ ఫ‌లితాలు.. భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం

పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు మంగ‌ళ‌వారం వెల్ల‌డి కానున్నాయి. బీహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాల‌కు మూడు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపున‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసిన‌ట్లు బీహార్ సీఈసీ హెచ్ఆర్ శ్రీనివాస మీడియాకు తెలిపారు. కొవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో కౌంటింగ్ కేంద్రాల‌ను 38 నుంచి 55కు పెంచామ‌ని పేర్కొన్నారు. ప్ర‌తి లెక్కింపు కేంద్రంలో కొవిడ్ నిబంధ‌న‌లు పాటించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. 38 జిల్లాల వ్యాప్తంగా 55 కేంద్రాల్లో 414 హాల్స్‌ను కౌంటింగ్‌కు సిద్ధం చేశామ‌న్నారు. పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. 59 కంపెనీల పారామిల‌ట‌రీ బ‌ల‌గాల‌ను రంగంలోకి దింపారు. స్ర్టాంగ్‌రూమ్‌ల వ‌ద్ద 19 కంపెనీల బ‌ల‌గాలు భ‌ద్ర‌త‌లో ఉన్నాయి.  

ఇక ఈ ఎన్నిక‌ల్లో మ‌హాఘ‌ట‌బంధ‌న్ గెలిచే అవ‌కాశం ఉంద‌ని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్ల‌డైన విష‌యం తెలిసిందే. ఎన్డీయే కూటమి ఓడిపోయే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు భావిస్తున్నారు. ఫ‌లితాలు ఎలా వ‌చ్చినా స‌రే.. సంయ‌మ‌నం పాటించాల‌ని ఆర్జేడీ కార్య‌క‌ర్త‌ల‌కు ఆ పార్టీ నాయ‌కుడు తేజ‌స్వి యాద‌వ్ సూచించారు.