బుధవారం 21 అక్టోబర్ 2020
National - Sep 24, 2020 , 20:59:51

తక్కువ ధరలో రీచార్జిబుల్‌ ఎన్‌95 మాస్క్‌.. హైదరాబాద్‌లో తయారీ!

తక్కువ ధరలో రీచార్జిబుల్‌ ఎన్‌95 మాస్క్‌.. హైదరాబాద్‌లో తయారీ!

హైదరాబాద్‌: తక్కువ ధరలో రీచార్జిబుల్‌ ఎన్‌95 మాస్క్‌ అందుబాటులోకి వచ్చింది. దీన్ని హైదరాబాద్‌లోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌(టీఐఎఫ్‌ఆర్‌) పరిశోధకులు అభివృద్ధి చేశారు. గ్రాఫీన్‌ ఆక్సైడ్‌ ఆధారిత పెయింట్‌ వాడకంతో ప్రామాణిక ఎన్‌95 మాస్క్‌లోని ఒక పొరను సవరించడం ద్వారా దీనిని సాధించారు. ఇది డికంటామినేషన్‌ (శుభ్రపరచడం) తర్వాత కూడా దాని సామర్థ్యాన్ని కోల్పోదని, దీనిని అనేకసార్లు వినియోగించవచ్చని టీఎఫ్ఆర్ హైదరాబాద్ గురువారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

ఈ మాస్క్‌ను దవడ కదలికల ద్వారా కూడా రీచార్జి చేసుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు. ఇది 95 శాతం సామర్థ్యంతో కణాలను (పరిమాణం ~ 0.3 మైక్రాన్లు) సంగ్రహించి ఫిల్టర్ చేస్తాయని తెలిపారు. డాక్టర్ జీ రాజలక్ష్మి, ప్రొఫెసర్ టీఎన్ నారాయణన్‌తోపాటు గ్రాడ్యుయేట్ విద్యార్థులు స్టెల్బిన్ పీటర్ ఫిగెరెజ్, సుదేష్నా పట్రాస్టేట్  నేతృత్వంలోని బృందం దీన్ని తయారు చేసింది. 

అలాగే, మాస్కు తయారీకి వాడిన పదార్థాల నాణ్యతను తెలుసుకునేందుకు పరిశోధకులు ఓ సరళమైన పరికరాన్ని కూడా అభివృద్ధి చేశారని టీఎఫ్ఆర్ తెలిపింది. ఇంటిలో దీన్ని తయారుచేసుకోవచ్చని పేర్కొంది. ఇందులో భారతీయ మార్కెట్లో తక్కువ ఖర్చుతో, సులభంగా లభించే సెన్సార్లను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. ఇది మాస్కు పదార్థం ద్వారా చొచ్చుకుని పోయే ఏరోసోల్స్, 0.3 మైక్రాన్ల వరకు కణాలను లెక్కించగలదని వెల్లడించింది. దీనిని ప్రస్తుతం ఇంజినీర్ ఆతిఫ్ అహ్మద్ సహకారంతో యూసర్‌ ఫ్రెండ్లీగా తయారుచేసేందుకు పరిశోధన బృందం ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo