శనివారం 04 జూలై 2020
National - Jun 19, 2020 , 03:06:37

అరచేయి.. ఐదు వేళ్లు!

అరచేయి.. ఐదు వేళ్లు!

  • హస్తగతం కోసం దశాబ్దాల కిందటే చైనా ప్రణాళిక 
  • టిబెట్‌ ఆక్రమణతో ప్రారంభం.. తాజాగా లడఖ్‌పై కన్ను 
  • టిబెట్‌ కీలక నేత లోబ్‌సాంగ్‌ హెచ్చరిక
న్యూఢిల్లీ, జూన్‌ 18: చైనా దురాక్రమణ దాహం లడఖ్‌తోనే ఆగదని సెంట్రల్‌ టిబెటన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీటీఏ) అధ్యక్షుడు, బహిష్కృత నేత లోబ్‌సాంగ్‌ సాంగ్యే హెచ్చరించారు. గల్వాన్‌ ఘర్షణపై గురువారం ఒక మీడియా సంస్థతో ఆయన మాట్లాడారు. టిబెట్‌ తర్వాత.. భారత్‌-చైనా సరిహద్దుల్లోని ఐదు ప్రాంతాలను ఆక్రమించుకోవటం అనేది కమ్యూనిస్టు చైనా వ్యవస్థాపకుడు మావో జెడాంగ్‌ రూపకల్పన చేసిన ఎజెండా అని వెల్లడించారు. దీనికే ‘పామ్‌, ఫైవ్‌ ఫింగర్స్‌' అని పేరు పెట్టారని, దీని ప్రకారం.. పామ్‌ (అరచేయి) అనేది టిబెట్‌ కాగా.. ఫైవ్‌ ఫింగర్స్‌ (ఐదు వేళ్లు) లడఖ్‌, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌లతోపాటు నేపాల్‌, భూటాన్‌ అని తెలిపారు.

దశాబ్దాల కిందటే కుట్ర

టిబెట్‌ను 1950లో ఆక్రమించుకున్నప్పుడే ఐదు వేళ్ల ఆక్రమణ ప్రణాళికను మావో, ఇతర చైనా నేతలు వెల్లడించారని సాంగ్యే తెలిపారు. ఈ దురాక్రమణ వ్యూహంలో మొదటివేలు లడఖ్‌ అని తెలిపారు. 2017లో డోక్లామ్‌ వివాదం, ఇప్పుడు గల్వాన్‌ ఘర్షణ కూడా ఈ వ్యూహంలో భాగమేనని అన్నారు. ‘చైనా నాయకత్వం మైండ్‌సెట్‌, వారి వ్యూహం భారత్‌ పూర్తిగా అర్థంచేసుకోలేదు. వాళ్లు అరచేతును(టిబెట్‌) ఆక్రమించారు. ఇప్పుడు వేళ్లవైపు వస్తున్నారు’ అని హెచ్చరించారు. ‘వివాదాల పరిష్కారానికి చర్చలు ఒక్కటే మార్గం. తన భూభాగాలను, సార్వభౌమత్వాన్ని కాపాడుకొనే హక్కు భారత్‌కు ఉంది. క్యారెట్‌ అండ్‌ స్టిక్‌ (ఆకర్షించి, నష్టపరచటం) అనేది చైనా విధానం. భారత్‌ కూడా ఇదే విధానాన్ని అవలంభించాలి. ముందుగానే ఎలాంటి చర్యలకు పూనుకోరాదు’ అని సూచించారు.

60 ఏండ్లనుంచి భారత్‌ను  హెచ్చరిస్తూనే ఉన్నాం

చైనా కుతంత్రాలు, అత్యంత ప్రమాదకరమైన ‘అరచేయి, ఐదువేళ్ల’ వ్యూహం గురించి భారతదేశాన్ని టిబెట్‌ నేతలు గత 60 ఏండ్లుగా హెచ్చరిస్తూనే ఉన్నారని సాంగ్యే తెలిపారు. ఈ వివాదాలపై టిబెట్‌ ఆధ్మాత్మిక గురువు దలైలామా మౌనం దాల్చటంపై సాంగ్యే స్పందించారు. 2011నుంచి ఆయన తన రాజకీయ అధికారాలను వదులుకుంటూ మతాన్ని, ప్రభుత్వాన్ని వేరుచేశారని తెలిపారు. ‘అందుకే టిబెట్‌లో రాజకీయ, పరిపాలన అంశాలపై మాట్లాడటం ఇప్పుడు నా బాధ్యత. సరిహద్దుల్లో హింసను తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే సమయంలో భారత్‌సహా పొరుగుదేశాలను హెచ్చరిస్తున్నా. జాగ్రత్తగా ఉండకపోతే గతంలో టిబెట్‌కు ఏం జరిగిందో రేపు మీకూ అదే జరుగుతుంది’ అని పేర్కొన్నారు. 


logo