మంగళవారం 26 మే 2020
National - May 08, 2020 , 17:57:25

చిన్నారి గొంతులో ఇరుక్కున్న పోకచెక్క.. సర్జరీ చేసి తీసిన వైద్యులు

చిన్నారి గొంతులో ఇరుక్కున్న పోకచెక్క.. సర్జరీ చేసి తీసిన వైద్యులు

కోయంబత్తూర్‌: పోకచెక్క గొంతులో ఇరుక్కోవడంతో విలవిల్లాడుతున్న ఓ చిన్నారిని ప్రాణాపాయం నుంచి రక్షించారు కోయంబత్తూర్‌కు చెందిన వైద్యులు. చిన్నారి కొండ నాలుక కింద ఇరుక్కుపోయిన పోకచెక్కను శస్త్రచికిత్స నిర్వహించి చాకచక్యంగా తొలగించారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్‌ జిల్లాలోని గోబిచెట్టిపాలయం గ్రామానికి చెందిన మూడేండ్ల చిన్నారి గురువారం పోకచెక్క మింగింది. అయితే, ఆ పోకచెక్క చిన్నారి కొండ నాలుక కింద ఇరుక్కోవడంతో ఊపిరాడక విలవిల్లాడింది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే పాపను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు తమవల్ల కాదనడంతో కోయంబత్తూర్‌లోని మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. 

కోయంబత్తూర్‌ ఆస్పత్రిలోని ఈఎన్‌టీ విభాగం హెడ్‌ అయిన డాక్టర్‌ అలీ సుల్తాన్‌ నేతృత్వంలోని బృందం పాపకు వెంటనే శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడింది. తక్కువ సమయంలో ఆస్పత్రికి తీసుకురావడంవల్ల పాపను ప్రాణాపాయం నుంచి రక్షించగలిగామని, లేదంటే పోకచెక్క మరింత ఉబ్బి ఊపిరాడక పాప మరణించి ఉండేదని డాక్టర్‌ అలీ సుల్తాన్‌ చెప్పారు. తల్లిదండ్రులు పసిపిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని, ఇలా గొంతులో ఇరుక్కునే ప్రమాదం ఉన్న వస్తువులేవీ వారికి అందుబాటులో ఉంచకూడదని ఆయన సూచించారు. 


logo