శుక్రవారం 05 జూన్ 2020
National - Feb 01, 2020 , 02:19:18

ముగ్గురు ఉగ్రవాదులు హతం

ముగ్గురు ఉగ్రవాదులు హతం
  • జమ్ము-శ్రీనగర్ హైవేపై భీకర ఎదురుకాల్పులు

బాన్న్ టోల్ ప్లాజా (జమ్ము): కశ్మీర్‌లోకి చొరబడేందుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు శుక్రవారం మట్టుబెట్టారు. జమ్ము- శ్రీనగర్ జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద జరిగిన భీకర కాల్పుల్లో ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు తెలిపారు. దాడులు చేసేందుకు కుట్రలు పన్నిన ఉగ్రవాదులు.. కథువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుగుండా దేశంలోకి చొరబడి ఉంటారని అనుమానిస్తున్నారు. నలుగురు ఉగ్రవాదులు ఒక లారీలో కశ్మీర్ లోయలోకి వస్తుండగా, జమ్ముకి 28 కి.మీ. దూరంలోని బాన్న్ టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం ఉదయం 5 గంటలకు తనిఖీ చేసేందుకు సీఆర్పీఎఫ్ సిబ్బంది, పోలీసులు లారీని నిలిపేశారు. వాహనం లోపల తనిఖీ చేసేందుకు వెళ్తుండగా.. ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. భద్రతాసిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడని డీజీపీ దిల్బాగ్‌సింగ్ తెలిపారు. మిగతావారు అడవిలోకి తప్పించుకొనే ప్రయత్నం చేశారని, ఆ తర్వాత ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందగా, ఒకరు తప్పించుకున్నారని చెప్పారు. ఉగ్రవాదులను  జైషేమహ్మద్ ఉగ్రసంస్థకు చెందినవారిగా గుర్తించామన్నారు. లారీ డ్రైవర్, క్లీనర్‌ను అరెస్టుచేసినట్టు తెలిపారు. తప్పించుకొన్న ఉగ్రవాది కోసం గాలిస్తున్నామన్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక పోలీస్ గాయపడ్డారని చెప్పారు.logo