బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 27, 2020 , 01:11:10

పేదలకు మూడునెలలు ఉచిత రేషన్‌

పేదలకు మూడునెలలు ఉచిత రేషన్‌

-ప్రజలకు కేంద్రం భరోసా 

-జన్‌ధన్‌ ఖాతాల్లోకి రూ.1500 నగదు 

-వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు రూ.వెయ్యి 

-రైతులకు 2వేలు సాయం 

-ఉపాధిహామీ కూలీ 202 

-3 నెలలపాటు పీఎఫ్‌ కేంద్రం నుంచి జమ

-పేదలెవరూ పస్తులుండొద్దనేదే మా లక్ష్యం

-వైద్యసిబ్బందికి రూ.50 లక్షల జీవిత బీమా

-కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌

-రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీ  ప్రకటన

న్యూఢిల్లీ, మార్చి 26: కరోనా వైరస్‌ విజృంభణ.. 21రోజుల దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఇబ్బంది పడుతున్న పేదలు, సామాన్యులతోపాటు ఇతర వర్గాలవారికి ఆపన్నహస్తం అందించింది. ముఖ్యంగా కరోనా వైరస్‌కు ఎదురొడ్డి పోరాడుతున్న వైద్య సిబ్బందికి రూ.50 లక్షల జీవితబీమా కల్పిస్తున్నట్టు తెలిపింది. కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలాసీతారామన్‌ గురువారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ప్యాకేజీ వివరాలను వెల్లడించారు. ప్రధాని మోదీ 21 రోజుల దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించిన 36 గంటల్లోనే ‘గరీబ్‌ కల్యాణ్‌ యోజన’ కింద ప్యాకేజీని ప్రకటిస్తున్నామని చెప్పారు. ప్యాకేజీలో భాగంగా మూడు నెలలపాటు పేదలకు ఉచితంగా బియ్యం, గోధుమలు వంటి ఆహార ధ్యాన్యాలు, వంట గ్యాస్‌ అందించనున్నట్టు చెప్పారు. వివిధ వర్గాల ప్రజలకు నగదు సాయాన్ని ప్రకటించారు. ‘పేదలెవరూ పస్తులుండొద్దు.. జేబులు ఖాళీగా ఉండొద్దు’ అనేదే తమ లక్ష్యమని నిర్మల స్పష్టంచేశారు. అవసరాన్ని బట్టి మిగతా వర్గాలవారికీ సాయం అందిస్తామన్నారు. అయితే లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా మూతపడిన కంపెనీలు, సంస్థలను కేంద్రం ఏ విధంగా ఆదుకుంటుందో మాత్రం నిర్మల తెలుపలేదు. 


15 కిలోల బియ్యం, కిలో పప్పు 

దేశవ్యాప్తంగా ఉన్న 80 కోట్ల మంది తెల్ల రేషన్‌కార్డుదారులకు ఐదు కిలోల చొప్పున బియ్యం లేదా గోధుమలు అందిస్తారు. వీటితోపాటు కిలో పప్పుధాన్యాలు ఇస్తారు. ఇలా మూడు నెలలపాటు పేదలకు ఉచితంగా రేషన్‌ సరుకులు అందజేయనున్నారు. లబ్ధిదారులు మూడు నెలల్లో రెండు విడుతలుగా వీటిని తీసుకోవచ్చు. ఈ సరుకుల విలువ రూ.45వేల కోట్ల వరకు ఉంటుంది. 

  • పీఎం ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకున్న 8.3 కోట్ల మంది పేద మహిళలకు వచ్చే మూడు నెలలపాటు ఉచితంగా సిలిండర్లు అందిస్తా రు. ఇందుకు రూ.13వేల కోట్లు వ్యయం చేయనున్నారు. 
  • దేశంలోని 63  లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలకు తనఖాలేని రుణపరిమితిని రూ.20 లక్షలకు పెంచారు. తద్వారా ఏడు కోట్ల కుటుంబాలు లబ్ధిపొందుతాయి.  
  • ఐదుకోట్ల మంది ఉపాధి హామీ కూలీలకు ప్రస్తుతం దినసరి కూలీ రూ.182 అందజేస్తుండగా.. దానిని రూ.202కు పెంచారు. తద్వారా ఉపాధి కూలీల కనీస ఆదాయం రూ.2000 వరకు పెరుగనుంది. 
  • 8.69 కోట్ల మంది రైతులకు ఏప్రిల్‌ మొదటివారంలో రూ.రెండు వేలు చొప్పున అందిస్తారు. దీని వ్యయం రూ.16వేల కోట్లు.
  • పీఎఫ్‌కు సంబంధించి.. వచ్చే మూడు నెలలపాటు ఉద్యోగుల తరఫున 12శాతం, కంపెనీల తరఫున 12 శాతం కలిపి 24 శాతం పీఎఫ్‌ను కేంద్రమే చెల్లిస్తుంది. 100మందికిపైగా ఉద్యోగులు ఉన్న సంస్థలకే ఇది వర్తిస్తుంది. ఇందులో కనీసం 90 శాతం మంది జీతాలు 15వేల లోపు ఉండాలి. ఉద్యోగులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా పీఎఫ్‌ మొత్తం నుంచి రూ.75వేల వరకు ఉపసంహరించుకునే అవకాశాన్ని కల్పించింది. మూడు నెలల జీతం లేదా 75 శాతం పీఎఫ్‌.. ఇందులో ఏది తక్కువైతే దానినే ఉపసంహరించుకోవచ్చు.

ఖాతాల్లోకి నేరుగా డబ్బు 

జన్‌ధన్‌ ఖాతాలున్న మహిళలకు ప్రతినెల నేరుగా రూ.500 చొప్పున జమ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 20.4 కోట్ల ఖాతాల్లోకి రూ.1500 ఒకేసారి జమచేస్తామని మంత్రి తెలిపారు. ఇందుకు రూ.31వేల కోట్లను కేటాయిస్తున్నట్టు చెప్పారు. పేద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ఖాతాల్లోకి రూ.వెయ్యి జమచేస్తామన్నారు. 


logo