సోమవారం 25 జనవరి 2021
National - Oct 13, 2020 , 13:39:54

నిద్రిస్తున్న బాలిక‌ల‌పై యాసిడ్ దాడి

నిద్రిస్తున్న బాలిక‌ల‌పై యాసిడ్ దాడి

జైపూర్‌: రాజ‌స్థాన్ రాష్ట్రం గోండా జిల్లాలో మ‌రో దారుణం జ‌రిగింది. కొన్ని రోజుల క్రితం అర్చ‌కుడిపై పెట్రోల్ పోసి త‌గుల‌బెట్టిన ఘ‌ట‌న‌ను మ‌రువ‌క‌ముందే అలాంటిదే మ‌రో ఘ‌ట‌న చోటుచేసుకుంది. నిద్రిస్తున్న ముగ్గురు బాలిక‌ల‌పై గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు యాసిడ్ దాడికి పాల్ప‌డ్డారు. ప‌రాస్‌పూర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని ప‌క్క‌పూర్వ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు బాలిక‌లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మ‌రో బాలిక‌కు స్వ‌ల్ప గాయాల‌య్యాయి. ప్ర‌స్తుతం వారు గోండాలోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. సోమ‌వారం రాత్రి భోజ‌నాల త‌ర్వాత ప‌క్క‌పూర్వ అక్కాచెల్లెళ్లైన‌ ముగ్గురు మైన‌ర్‌లు త‌మ ఇంటి మొద‌టి అంత‌స్తులో ప‌డుకున్నారు. అయితే మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున నిద్ర‌లో ఉన్న ఆ ముగ్గురిపై గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు యాసిడ్ దాడి చేశారు. దీంతో కుటుంబ‌స‌భ్యులు వారిని వెంట‌నే గోండా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీంతో వైద్యులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చి బాధిత బాలిక‌ల‌ను చికిత్స మొద‌లుపెట్టారు. పెద్ద బాలిక‌కు 30 శాతం, రెండో బాలిక‌కు 20 శాతం కాలిన గాయాల‌య్యాయ‌ని, చిన్న బాలిక 5 శాతం కాలిన గాయాల‌తో ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డింద‌ని తెలిపారు. 

కాగా, ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. దాడి ఎవ‌రి చేశార‌నే కోణంలో ద‌ర్యాప్తు చేప‌ట్టారు. తాము కేసు న‌మోదు చేసి నిందితుల‌ను గుర్తించే ప‌నిలో ఉన్నామ‌ని పోలీసులు తెలిపారు. ఘ‌ట‌న‌కు సంబంధించి బాధిత బాలిక‌లుగానీ, వారి కుటుంబ‌స‌భ్యులుగానీ ఎలాంటి క్లూ ఇవ్వ‌లేక‌పోతున్నార‌ని, అయినా అన్ని కోణాల్లో ద‌ర్యాప్తు చేసి నిందితులను ప‌ట్టుకుంటామ‌ని చెప్పారు.       

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo