గురువారం 02 జూలై 2020
National - Jun 21, 2020 , 09:17:37

వాట్సప్‌ చాట్‌ హ్యాక్‌.. 100 మంది బాలికల బ్లాక్‌మెయిలింగ్‌

వాట్సప్‌ చాట్‌ హ్యాక్‌.. 100 మంది బాలికల బ్లాక్‌మెయిలింగ్‌

ఛండీగఢ్‌ : వాట్సప్‌ చాట్‌ హ్యాక్‌ చేసి 100 మంది బాలికలను బ్లాక్‌మెయిల్‌ చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రం ఫరిదాబాద్‌లో చోటుచేసుకుంది. నిందితుల్లో ఓ బాలిక కూడా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తార్‌ఖాన్‌, మనీశ్‌, పూజా స్నేహితులు. సత్తార్‌ ఎయిర్‌టెల్‌ ప్రమోటర్‌గా పనిచేస్తున్నాడు. నకిలీ ఆధార్‌కార్డులతో సిమ్‌ కార్డ్స్‌ను సమకూర్చేవాడు. సత్తార్‌ఖాన్‌ సహాయంతో మనీశ్‌, పూజా ఈ నకిలీ నెంబర్ల నుంచి సదరు బాలికలకు కాల్‌ చేసి బ్లాక్‌మెయిల్‌కు గురిచేసి డబ్బులు దండుకున్నారు. చెప్పిన బ్యాంక్‌ అకౌంట్లలో నగదు జమచేయకపోతే వ్యక్తిగత సమాచారాన్నంతా బహిర్గత పరిచి సోషల్‌ మీడియాలో  ప్రచారం చేస్తామని బెదిరింపులకు పాల్పడేవారు. నిందితుల్లో ఒకరు ఇటీవలే 12వ తరగతి పాస్‌ అయ్యాడు.

ఇలా వాట్సప్‌ చాట్‌ హ్యాక్‌ చేసి పల్వాల్‌, ఫరిదాబాద్‌, గురుగ్రామ్‌, ఢిల్లీలో 100 మందికి పైగా బాలికలను బ్లాక్‌మెయిల్‌కు గురిచేసి డబ్బులు వసూలు చేశారన్నారు. కాగా వీరి భారిన పడ్డ ఓ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫరిదాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులు కొంతమంది స్కూలు, కాలేజీ విద్యార్థులతో స్నేహం ఏర్పరుచుకొని ఎలాగోలా వారి నుంచి బాలికల ఫోన్‌ నంబర్లు తీసుకునేవారని పోలీసులు తెలిపారు. బాధితుల ఫోన్‌ నెంబర్లలో సేవ్‌ అయిన నంబర్లను కూడా కొన్నిసార్లు టార్గెట్‌గా చేసుకునేవారని పేర్కొన్నారు.



logo