మంగళవారం 07 జూలై 2020
National - Apr 22, 2020 , 01:30:38

జర్నలిస్టులపై కరోనా పడగ

జర్నలిస్టులపై కరోనా పడగ

  •  చెన్నైకి చెందిన 25 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ
  • పరీక్షలు నిర్వహించనున్న యూపీ, ఢిల్లీ, కర్ణాటక

చెన్నై/న్యూఢిల్లీ: జర్నలిస్టులపై కరోనా వైరస్‌ పంజా విసురుతున్నది. దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 బారిన పడుతున్న మీడియా ప్రతినిధుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. సోమవారం ఒకేరోజు ముంబయిలో 53 జర్నలిస్టులకు పాజిటివ్‌ అని తేలడం కలకలం సృష్టించింది. తాజాగా ఒక తమిళ న్యూస్‌ చానల్‌లో జర్నలిస్టులతోపాటు మొత్తం 25 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలిందని మంగళవారం తమిళనాడు ఆరోగ్యశాఖ వెల్లడించింది. 90 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 25 మందికి పాజిటివ్‌గా బయటపడిందని అధికారులు తెలిపారు. ఈ సంఖ్య 27కు పెరుగొచ్చని పేర్కొన్నారు. నగరంలో ఇప్పటికే ఇద్దరు జర్నలిస్టులతోపాటు టీవీ చానల్‌కు చెందిన ఓ వ్యక్తికి కొవిడ్‌-19 పాజిటివ్‌ అని తేలింది. 

మీడియా ప్రతినిధులందరికీ పరీక్షలు

ఢిల్లీలోని మీడియా ప్రతినిధులందరికీ బుధవారం నుంచి కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని సీఎం కేజ్రీవాల్‌ ప్రకటించారు. గుర్తింపు కార్డులున్న అందరు పాత్రికేయులకు వైరస్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు యూపీ సర్కారు కూడా ఒక ప్రకటనలో పేర్కొంది. కర్ణాటకలోనూ జర్నలిస్టులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు, కరోనా కాలంలో కూడా విధుల్ని నిర్వహిస్తున్న జర్నలిస్టుల సేవలకు గుర్తుగా రూ. 31.10 లక్షల్ని ఇస్తున్నట్టు సిక్కిం సీఎం ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌ ప్రకటించారు.

కరోనాతో మీడియా స్వేచ్ఛకు ముప్పు

కరోనా వల్ల మీడియా స్వేచ్ఛకు మరింత ముప్పు ఉన్నదని అంతర్జాతీయ పాత్రికేయ పరిశీలనా బృందం హెచ్చరించింది. ఆరోగ్య సంక్షోభం సాకుతో ప్రభుత్వాలు అసాధారణ నిర్ణయాలు తీసుకుంటాయని, ప్రజలతోపాటు మీడియాపైనా ఆంక్షలు విధించవచ్చని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాల్లో మీడియా స్వేచ్ఛపై వార్షిక నివేదికను పారిస్‌లో మంగళవారం విడుదల చేసింది. ఈసారి కూడా నార్వే టాప్‌ర్యాంకులో ఉండ గా ఉత్తరకొరియా చివరిస్థానంలో ఉన్నది.  మరోవైపు లాక్‌డౌన్‌ వల్ల ఆన్‌లైన్‌ మాధ్యమాల వినియోగం భారీగా పెరిగింది. మార్చి 25కు ముందు రోజువారీ సగటు వినియోగం 1.5 గంటలు ఉండగా ఆ తర్వాత 4 గంటలకు చేరింది. మొబైల్‌ డేటా వినియోగం కూడా 30 శాతం పెరిగింది.


logo