ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 11, 2020 , 18:01:50

ఖైదీలకు ఆన్‌లైన్‌ ద్వారా యోగా శిక్షణ

ఖైదీలకు ఆన్‌లైన్‌ ద్వారా యోగా శిక్షణ

చెన్నై: రాష్ట్రంలోని వివిధ నగరాల్లోగల అన్ని కేంద్ర జైళ్లలో ఖైదీల కోసం ఈషా యోగా సెంటర్ ఆన్‌లైన్ యోగా సెషన్లు నిర్వహిస్తున్నట్లు తమిళనాడు జైళ్ల విభాగం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. తమిళనాడు జైళ్ల శాఖ అభ్యర్థన మేరకు ఈషా యోగా సెంటర్ చెన్నై, వెల్లూరు, కడలూరు, త్రిచి, సేలం, పాలయన్కోట్టైలోని అన్ని కేంద్ర జైళ్లలో ఖైదీల కోసం ఆన్‌లైన్ యోగా సెషన్లను నిర్వహిస్తోందని పేర్కొంది. సద్గురువు వద్ద శిక్షణ పొందిన ఈషా ఉపాధ్యాయులు తమిళంలో ఆన్‌లైన్ మాడ్యూళ్ళను అందిస్తున్నారని తెలిపింది.

‘ఖైదీల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వ జైళ్ల శాఖ ఈ అభ్యర్థన చేసింది. ఆన్‌లైన్ సెషన్లు జూలై 28 న ప్రారంభమయ్యాయి. యోగా నమస్కార్‌. సింహక్రియ, ఈషా క్రియలో శిక్షణ ఇస్తున్నారు. సింహక్రియ అనేది మూడు నిమిషాల యోగా సాధన. దీనిని సద్గురువు రూపొందించారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఒక సాధనంగా ఉపయోగపడుతుంది.’ అని జైళ్ల విభాగం పేర్కొంది.  ఆన్‌లైన్ సెషన్ల ద్వారా తమిళనాడు వ్యాప్తంగా వేలాది మంది ఖైదీలు లబ్ధి పొందుతున్నారని ఆ విభాగం తెలిపింది. ఈషా దాదాపు 20 సంవత్సరాలుగా రాష్ట్ర జైళ్లలో యోగా సెషన్లు నిర్వహిస్తున్నది.


logo