మంగళవారం 26 మే 2020
National - May 19, 2020 , 12:18:17

లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. ఆధ్యాత్మిక గురువు అంత్యక్రియల్లో వేలాది మంది

లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. ఆధ్యాత్మిక గురువు అంత్యక్రియల్లో వేలాది మంది

భోపాల్‌ : లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి.. ఓ ఆధ్యాత్మిక గురువు అంత్యక్రియల్లో వేలాది మంది పాల్గొన్నారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని కత్ని జిల్లాలో ఆదివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆధ్యాత్మిక గురువు దేవ్‌ ప్రభాకర్‌ శాస్త్రి(82) దాదాజీగా ప్రసిద్ధి. గత కొంతకాలంగా కిడ్నీ, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ప్రభాకర్‌ శాస్త్రి ఆదివారం తుదిశ్వాస విడిచారు. దాదాజీ మృతి చెందారని వార్త తెలుసుకున్న ఆయన భక్తులు.. కత్ని జిల్లాకు వేలాది సంఖ్యలో చేరుకున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకుండా.. కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీలకు చెందిన నాయకులతో పాటు నటుడు అష్‌తోస్‌ రానా కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ దృశ్యాలను కొందరు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారు. 

ఈ దృశ్యాలపై కత్ని జిల్లా కలెక్టర్‌ షషీ భూషణ్‌ సింగ్‌ స్పందించారు. దాదాజీ అంత్యక్రియల్లో లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించలేదు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించారని తెలిపారు. 

దాదాజీ భౌతికకాయానికి మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, బీజేపీ జాతీయ జనరల్‌ సెక్రటరీ కైలాష్‌ విజయ్‌వర్గీయ, మాజీ సీఎం కమల్‌నాథ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌ దిగ్విజయ్‌ సింగ్‌తో పాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. అయితే కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగించిన విషయం విదితమే. అంత్యక్రియలకు కేవలం 20 మంది కంటే ఎక్కువ హాజరు కావొద్దని కేంద్రం ఆదేశించింది. 


logo