శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 17:45:54

ఇంట్లో 'టీవీ' ఏ వైపుకు మ‌ళ్లిస్తున్నారు.. ఇలా పెడితే అంతా సంతోష‌మేన‌ట‌!

ఇంట్లో 'టీవీ' ఏ వైపుకు మ‌ళ్లిస్తున్నారు.. ఇలా పెడితే అంతా సంతోష‌మేన‌ట‌!

వాస్తు.. భార‌తీయులు వాస్తును బాగా న‌మ్ముతారు. ఒక జ్యోతిష్యుడు చెప్పిన‌ట్లుగా ఇంటి నిర్మాణం చేస్తారు. మ‌ర‌లా ఎవ‌రైనా చూసి ఇక్క‌డ ఈ గోడ ఉండ‌కూడ‌దు. ఉంటే అరిష్టం అని చెప్ప‌గానే ముందుచెప్పిన జ్యోతిష్యుడు మాట‌ను వ‌దిలేసి ఇత‌ను చెప్పింది వింటారు. ఇలా ఎంత‌మంది మాట‌లైనా వింటూనే ఉంటారు. వాస్తు విష‌యంలో ఇంత ఆస‌క్తి చూపుతారు భార‌తీయులు. అంతా బాగున్న‌ప్ప‌డు వీటి గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోం. అదే ఏదైనా చిన్న పొర‌పాటు, చెడు జ‌రిగితే ప్ర‌తీదాన్ని అనుమానించాల్సి ఉంటుంది. అయితే ఇంట్లో చీపురు నుంచి బీరువా వ‌ర‌కు అన్ని వ‌స్తువులు ఎక్క‌డ పెట్టుకోవాలో తెలుసుకుంటాం.

కానీ టీవీ ఏ విధంగా పెట్టుకోవాలో ఇప్ప‌టివ‌ర‌కు సందేహం వ‌చ్చిందా? అదేముంది టీవీ కోసం ప్ర‌త్యేకంగా క‌ప్‌బోర్డ్ కూడా పెట్టిస్తాం క‌దా అనుకుంటారేమో. చెప్పేది దాని గురించి కాదు. ఏ వైపుకు మ‌ళ్లిస్తాం అని. ఈ విష‌యం అర్థం కావాలంటే.. ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ ప‌ర్వీన్ క‌శ్వాన్ టీవీ ఉన్న ఫొటో ట్వీట్ చేశారు. అయితే టీవీ వెనుక స్క్రీన్ ఉన్న ఫొటోను పోస్టు చేశారు. ‘‘వాస్తు శాస్త్రం ప్రకారం.. టీవీని ఈ వైపుకు పెడితే ఇల్లు, మనసు, జీవితానికి సుఖశాంతులు లభిస్తాయని మా పెద్దన్నయ్య చెప్పాడు’’ అనే శీర్షిక‌ను జోడించారు. ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతుంది. కొంతమంది నెటిజ‌న్లు ఫ‌న్నీగా కామెంట్లు పెడుతున్నారు. 'అస‌లు ఇంట్లో టీవీ లేకుండా ఉంటే మ‌రింత మంచిది క‌దా అంటే.. స‌రేగాని ఫోన్ కూడా ఎక్క‌డ, ఎలా పెట్టుకోవాలో చెప్పండంటూ' కామెంట్లు పెడుతున్నారు.