శనివారం 11 జూలై 2020
National - Jun 27, 2020 , 16:19:33

రూ.3.46 రుణం చెల్లించేందుకు 15 కి.మీ. న‌డిచిన రైతు

రూ.3.46 రుణం చెల్లించేందుకు 15 కి.మీ. న‌డిచిన రైతు

బెంగ‌ళూరు : బ‌్యాంకు అధికారుల ఆదేశాల మేర‌కు రుణం చెల్లించేందుకు ఓ రైతు 15 కిలోమీట‌ర్లు న‌డ‌వాల్సి వ‌చ్చింది. ఆ రుణం కూడా కేవ‌లం 3 రూపాయాల 46 పైస‌లు మాత్ర‌మే. 

క‌ర్ణాట‌క‌లోని శిమోగ జిల్లా బారువ్ గ్రామానికి చెందిన రైతు ఆమ‌దే ల‌క్ష్మీనారాయ‌ణ.. కెన‌రా బ్యాంకు నుంచి వ్య‌వ‌సాయ రుణం తీసుకున్నాడు. రైతు గ్రామం ప‌శ్చిమ అడ‌వుల్లో ఉంది. బ్యాంకేమో.. గ్రామానికి 15 కిలోమీట‌ర్ల దూరంలోని నిత్తూరు టౌన్ లో ఉంది. 

అయితే బ్యాంకు అధికారులు రైతుకు ఫోన్ చేసి త‌క్ష‌ణ‌మే బ్యాంక్ కు వ‌చ్చి రుణం చెల్లించాల‌ని ఆదేశించారు. ఆ రైతు అష్ట‌క‌ష్టాలు ప‌డి.. బ్యాంక్ కు న‌డిచి వ‌చ్చాడు. అక్క‌డికొచ్చాక‌.. మీరు చెల్లించాల్సిన రుణం కేవ‌లం 3 రూపాయాల 46 పైస‌లు మాత్ర‌మే అని బ్యాంకు అధికారులు చెప్పారు. ఈ మాట విన్న రైతు షాక్ కు గుర‌య్యాడు. అప్ప‌టిక‌ప్పుడు ఆ రుణం చెల్లించాడు. వ్య‌వ‌సాయ రుణం కింద బ్యాంకు నుంచి రూ. 35 వేలు తీసుకోగా.. రూ. 32 వేల‌ను ప్ర‌భుత్వం మాఫీ చేసింది. మిగ‌తా రూ. 3 వేల‌ను కొన్ని నెల క్రితం రైతే బ్యాంకుకు చెల్లించాడు. ఇక ఏమీ అప్పు లేద‌ని రైతు అనుకున్నాడు. కానీ ఈ రూ.3.46 పైస‌ల‌కు బ్యాంకు అధికారులు ఫోన్ చేయ‌డంతో షాక్ అయ్యాడు రైతు.  

ఈ ఘ‌ట‌న‌పై కెన‌రా బ్యాంక్ మేనేజ‌ర్ ఎల్ పింగ్వాను మీడియా వివ‌ర‌ణ కోర‌గా.. త‌మ బ్రాంచిలో ఆడిట్ జ‌రుగుతుండ‌టంతో.. రుణాలు చెల్లించ‌ని వారికి ఫోన్లు చేసి చెల్లించ‌మ‌ని కోరాము అని తెలిపారు. ఆ రైతు సంత‌కం కూడా అవ‌సరం ఉన్న‌ది కాబ‌ట్టి ఆక‌స్మాత్తుగా పిల‌వాల్సిన అవ‌స‌రం వ‌చ్చింద‌న్నారు. 

బ్యాంకు అధికారుల తీరు ప‌ట్ల రైతు తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌య్యాడు.  త‌న‌ను హార్ట్ చేశార‌ని రైతు బాధ‌ప‌డ్డాడు. బ్యాంకు అధికారుల‌పై ప‌లువురు నెటిజ‌న్లు కూడా మండిప‌డ్డారు.


logo