e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home News అస్సాం, మిజోరం స‌రిహ‌ద్దు ఎందుకు ఉద్రిక్తంగా ఉంది? ఈ స‌మ‌స్య‌తో బ్రిటీష‌ర్లకు లింకేంటి?

అస్సాం, మిజోరం స‌రిహ‌ద్దు ఎందుకు ఉద్రిక్తంగా ఉంది? ఈ స‌మ‌స్య‌తో బ్రిటీష‌ర్లకు లింకేంటి?

ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మిజోరం స‌రిహ‌ద్దు అట్టుడుకుతోంది. సోమ‌వారం జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో అస్సాంకు చెందిన ఐదుగురు పోలీసులు మ‌ర‌ణించ‌డం ఈ ఉద్రిక్త‌త‌ల‌ను మ‌రింత పెంచింది. అయితే ఈ రాష్ట్రాల స‌రిహ‌ద్దు స‌మస్య ఇప్ప‌టిది కాదు. కొన్ని ద‌శాబ్దాలుగా ర‌గులుతూనే ఉంది. గ‌తేడాది, తాజాగా జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల‌తో ఇది మొత్తం దేశం దృష్టిని ఆక‌ర్షించింది. ఈ నేప‌థ్యంలో అస‌లు ఈ స‌మ‌స్య ఎప్పుడు మొద‌లైంది? బ్రిటీష‌ర్ల‌కు దీంతో ఉన్న సంబంధం ఏంటి? స‌మ‌స్య ప‌రిష్కారంలో కేంద్ర ప్ర‌భుత్వ పాత్ర ఏమిటి అన్న అంశాల‌ను ఓసారి చూద్దాం.

స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌.. కార‌ణం ఏంటి?

అంత‌ర్గ‌త స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌కు బీజం 19వ శ‌తాబ్దంలోనే ప‌డింది. దేశాన్ని త‌మ గుప్పిట్లోకి తీసుకున్న బ్రిటీష‌ర్లు మెల్ల‌గా ఈశాన్య భార‌తంలోకి అడుగుపెడుతున్న స‌మ‌య‌మ‌ది. అస్సాంను త‌మ ప్ర‌ధాన స్థావ‌రంగా చేసుకొని అక్క‌డి నుంచి చుట్టుప‌క్క‌ల ఆదివాసీల ప్రాంతాల‌ను స్వాధీనం చేసుకోవాల‌ని బ్రిటీష‌ర్లు ప్ర‌య‌త్నించారు. అలా ఈశాన్య భార‌తం చాలా వ‌ర‌కూ అస్సాంలో భాగంగానే ఉంది. దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చేప్ప‌టికి ఈశాన్య భార‌త దేశంలో అస్సాంతో పాటు మ‌ణిపూర్‌, త్రిపుర సంస్థానాలు మాత్ర‌మే అంత‌ర్భగంగా ఉండేవి. 1963-87 మ‌ధ్య అస్సాంను విడ‌దీసి నాగాలాండ్‌, మేఘాల‌య‌, మిజోరం, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాల‌ను ఏర్పాటు చేశారు. అయితే ఈ రాష్ట్రాలు ఏర్ప‌డిన‌ప్పుడు స‌రిహ‌ద్దుల‌ను స‌రిగ్గా నిర్ణ‌యించ‌క‌పోవ‌డం ఇప్పుడీ స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది.

- Advertisement -

త‌మ‌కు చెందాల్సిన ఎన్నో ముఖ్య‌మైన భూభాగాలు అస్సాంలోకి వెళ్లిపోయాయ‌ని ఇప్ప‌టికీ మిజోరంతోపాటు నాగాలాడ్‌, మేఘాల‌య భావిస్తున్నాయి. అందుకే మిజోరం స‌రిహ‌ద్దులోనే కాదు అస్సాంలో నాగాలాండ్‌, మేఘాల‌య‌, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ స‌రిహ‌ద్దుల్లోనూ అప్పుడ‌ప్పుడూ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొంటూనే ఉంటాయి. ఇప్ప‌టికే ఎన్నో స‌రిహ‌ద్దు క‌మిష‌న్ల‌ను ఏర్పాటు చేసినా.. వాటి సిఫార్సుల‌ను ఈ రాష్ట్రాలు అంగీక‌రించక‌పోవ‌డంతో అవి వృథా అయిపోయాయి.

అస్సాం, మిజోరం గొడ‌వ ఎప్ప‌టి నుంచి?

1972లో మిజోరంను కేంద్ర పాలిత ప్రాంతంగా.. ఆ త‌ర్వాత 1987లో ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. అయితే అంత‌కుముందు దీనిని లూషాయి హిల్స్‌గా పిలిచేవారు. ప్ర‌స్తుతం ఈ హిల్స్‌ను మీజో హిల్స్ అంటున్నారు. మిజోరం రాష్ట్రంలో ఉన్న ఈ కొండ‌లే ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్నాయి. బ్రిటీష‌ర్లు తేయాకు పండించ‌డానికి అస్సాంలోని ద‌క్షిణ ప్రాంతంలోని కాచ‌ర్ జిల్లాకు వెళ్లిన స‌మ‌యంలో అక్క‌డి మీజో ఆదివాసీల‌తో ఘ‌ర్ష‌ణ త‌లెత్తింది. త‌మ‌ లూషాయి హిల్స్ కోసం బ్రిటీష‌ర్ల‌తో యుద్ధానికీ దిగ‌డంతో హింస జ‌రిగింది. ఆ త‌ర్వాత బ్రిటీష‌ర్లు మీజో ఆదివాసీ పెద్ద‌ల‌తో ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ ఆదివాసీ ప్రాంతాల్లోకి బ‌య‌టి వ్య‌క్తులు రాకుండా ఉండేందుకు ర‌క్ష‌ణ‌గా ఓ ఇన్న‌ర్ లైన్‌ను బ్రిటీష‌ర్లు ఏర్పాటు చేశారు. ఇది 1875లో జ‌రిగింది. దీని ప్ర‌కారం ఈ లూషాయి హిల్స్ మిజోరంకే ద‌క్కుతాయి. అప్పుడు బ్రిటీష‌ర్లు గీసిన స‌రిహ‌ద్దే స‌రైన‌ద‌ని, దానినే అధికారికంగా గుర్తించాల‌ని మిజోరం అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది. అయితే 1933లో ఈశాన్య భార‌తాన్ని పూర్తిగా త‌మ ఆధీనంలోకి తీసుకున్న స‌మ‌యంలో బ్రిటీష‌ర్లు మిజోరం మ్యాప్‌ను మ‌ళ్లీ మార్చారు. 1933లో ఇది జ‌రిగింది. కానీ ఈసారి అక్క‌డి మీజో పెద్ద‌ల‌ను సంప్ర‌దించ‌కుండా ఏక‌ప‌క్షంగా ఇది జ‌రిగింద‌ని, దీనిని అంగీక‌రించ‌బోమ‌ని మిజోరం చెబుతోంది. 1875 డీమార్కేష‌న్‌నే కొన‌సాగించాల‌ని వాదిస్తోంది.

రొహింగ్యా వ‌ల‌స‌దారులూ కార‌ణ‌మేనా?

అస్సాం, మిజోరం రాష్ట్రాల స‌రిహ‌ద్దుల్లోని లైలాపూర్‌కు బంగ్లాదేశ్, రొహింగ్యా వ‌ల‌స‌దారులు భారీగా వ‌ల‌స వ‌చ్చారు. అప్ప‌టి నుంచి స‌రిహ‌ద్దు ప్రాంతంలో భూమి కోసం ఒత్తిళ్లు ఎక్కువ కావ‌డం మొద‌ల‌య్యాయి. రెండు రాష్ట్రాల మ‌ధ్య వివాదాలు పెరిగాయి. వ‌ల‌స‌దారులు రాక‌ముందు అస్సాంలోని లైలాపూర్ నుంచి మిజోరంలోని వైరెంగ్టే వ‌ర‌కు ప్ర‌శాంత ప‌రిస్థితులే ఉండేవి. వ‌ల‌స‌లు పెరిగిన త‌ర్వాత‌నే ఇల్లు, పొలాల కోసం అడ‌వుల‌ను న‌రికారు. వాటిలో నివాసాల‌ను ఏర్ప‌ర‌చుకున్నారు. ఈ నేప‌థ్యంలో కూడా మిజోలు గుర్రుగా ఉన్నారు.

స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ఏంటి?

1970ల నుంచే స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌తో అస్సాం, మిజోరం మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు జ‌రుగుతున్నాయి. 2020లో ఇవి మ‌రింత పెద్ద‌వి అయ్యాయి. తాజాగా ఐదుగురు పోలీసులు మృతి చెందడ‌టంతో దీని తీవ్ర‌త దేశం మొత్తానికీ తెలిసి వ‌చ్చింది. నిజానికి అస్సాంలో బీజేపీ ప్ర‌భుత్వం ఉంది. మిజోరంలో అక్క‌డి మిజో నేష‌న‌ల్ ఫ్రంట్‌తో క‌లిసి బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. అయినా స‌మ‌స్య ప‌రిష్కారం కోసం ఆ పార్టీ ప్ర‌య‌త్నించ‌డం లేదు. దీంతో కేంద్ర‌మే ఇప్పుడు రెండు రాష్ట్రాల‌ను చ‌ర్చ‌ల‌కు పిలిచి స‌మ‌స్య ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నించాల‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. లేదంటే రెండు రాష్ట్రాలు అంగీక‌రించేలా మ‌రో స‌రిహ‌ద్దు క‌మిష‌న్ ఏర్పాటు చేసి, దాని సిఫార్సుల మేర‌కు న‌డుచుకోవాల‌నీ సూచిస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana