బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 05, 2020 , 17:20:55

ఇవే నా చివరి ఎన్నికలు: సీఎం నితీశ్‌ కుమార్‌

ఇవే నా చివరి ఎన్నికలు: సీఎం నితీశ్‌ కుమార్‌

పాట్నా: తనకు ఇవే చివరి ఎన్నికలని బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ తెలిపారు. పూర్ణియలోని ధమ్ధహా ఎన్నికల సభలో గురువారం మాట్లాడిన ఆయన ఈ మేరకు స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలే తాను పోటీ చేసే చివరి ఎన్నికలని తెలిపారు. ‘దయచేసి తెలుసుకోండి. ప్రచారానికి ఇవాళే చివరి రోజు. ఎల్లుండి ఓటింగ్‌. ఇదే నా చివరి ఎన్నిక. అంతా బాగానే ముగుస్తుంది’ అని ఎన్నికల సభలో పాల్గొన్న ప్రజలనుద్దేశించి సీఎం నితీశ్‌ కుమార్‌ అన్నారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్‌ ప్రచారం ముగిసే చివరి రోజున ఆయన ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది.

ఈ నెల 7న చివరి, మూడో దశ పోలింగ్‌ జరుగనుండగా 10న ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. అయితే 69 ఏండ్ల నితీశ్‌ కుమార్‌ ఈ ఎన్నికల్లో గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ఐదోసారి సీఎం కావాలన్న ఆయన కల నెరవేరుతుందా లేదా అనేది ఈ నెల 10వ తేదీ తర్వాత తెలుస్తుంది. అయితే బీహార్‌ సీఎంగా ఆయన పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదు. లోక్‌నీతి-సీఎస్‌డీఎస్‌ నిర్వహించిన సర్వే ప్రకారం జేడీయూ చీఫ్‌ నితీశ్‌ కుమార్‌ను సీఎంగా 31 శాతం మంది రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. 27 శాతం ప్రజాదరణతో తేజస్వి యాదవ్‌ తర్వాత స్థానంలో ఉన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.