ఆదివారం 29 మార్చి 2020
National - Mar 24, 2020 , 01:51:00

ఇది జీవితకాల సవాల్‌

ఇది జీవితకాల సవాల్‌

  • ‘లాక్‌డౌన్‌' మార్గదర్శకాలు పాటించండి 
  • మిమ్మల్ని, మీ కుటుంబాలను కాపాడుకోండి 
  • దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ పిలుపు 
  • నిబంధనలు కఠినంగా అమలుచేయాలని రాష్ర్టాలకు ఆదేశం 

న్యూఢిల్లీ, మార్చి 23: కరోనా వైరస్‌పై పోరు ను ‘జీవితకాల సవాల్‌'గా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. ప్రజలు ‘లాక్‌డౌన్‌'ను పెద్దగా పట్టించుకోవడంలేదని సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. దయచేసి ఇండ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తిచేశారు. ‘లాక్‌డౌన్‌ను అనేకచోట్ల ప్రజలు పట్టించుకోవడం లేదు. దయచేసి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మీ కుటుంబాలను కాపాడుకోండి. ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించండి’ అని ట్విట్టర్‌ వేదికగా విన్నవించారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలను పక్కాగా అమలుచేయాలని సూచించారు. మరోవైపు ప్రధాని మోదీ మీడియా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కొవిడ్‌-19 వైరస్‌పై పోరును ‘జీవితకాల సవాల్‌'గా అభివర్ణించారు. ఈ వైరస్‌ కట్టడికి వినూత్న, సరికొత్త పరిష్కార మార్గాలను అన్వేషించాలన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో మీడియా సిబ్బంది ఈ దేశానికి చేస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు. మహమ్మారి తీవ్రతను, దాని దుష్ప్రభావాలను అర్థం చేసుకొని ప్రజల్లో అవగాహన పెంచుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను, నిరాశావాదాన్ని పోగొట్టేలా సానుకూల కథనాలు ప్రసారం చేయాలని కోరారు. ‘మనం సుదీర్ఘ యుద్ధం చేయాల్సి ఉన్నది. సామాజిక దూరంపై ప్రతి ఒక్కరిలో చైతన్యం తేవాలి. తాజా పరిస్థితులు, ప్రభుత్వ కీలక నిర్ణయాలు, ఇతరాంశాలను వేగంగా, సులభంగా అర్థమయ్యే భాషలో ప్రజలకు వివరించాలి’  అని సూచించారు. కరోనాపై పోరులో మీడియా చానళ్ల ఫీడ్‌బ్యాక్‌ ఎంతో కీలకంగా మారుతున్నదని, దానికనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు. 

మీటర్‌ దూరం పాటించండి 

క్షేత్రస్థాయిలోని విలేకరులు కచ్చితంగా సామాజిక దూరం పాటించాలని ప్రధాని మోదీ కోరారు. ఇంటర్వ్యూ చేసే సమయంలో కనీసం ఒక మీటరు ఎడం పాటించాలన్నారు. మీడియా సంస్థలు తమ విలేకరులకు ‘బూమ్‌ మైక్‌'లను అందజేయాలని సూచించారు. మీడియా శాస్త్రీయమైన సమాచారాన్నే ప్రసారం చేయాలని, నిపుణులతోనే చర్చలు నిర్వహించాలని చెప్పారు. తద్వారా వదంతులు వ్యాప్తి చెందకుండా అడ్డుకోవచ్చన్నారు. శాస్త్రీయ కథనాల ప్రసారం ద్వారా పుకార్లకు అడ్డుకట్ట వేయాలని విన్నవించారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించి వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరెన్సీ నోట్ల ద్వారా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు డిజిటల్‌ చెల్లింపులు పెరిగేలా చైతన్యం తేవాలని కోరారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ప్రధాని మోదీకి పలు సూచనలు చేశారు. తరుచూ జాతినుద్దేశించి ప్రసంగించాలని కోరారు. ఇందులో సానుకూల కథనాలు, కొవిడ్‌-19 బారిన పడి కోలుకున్నవారి అనుభవాలను ప్రస్తావించాలని సూచించారు. మీడియా ప్రతినిధులను పరీక్షించేందుకు 24గంటలపాటు అందుబాటులో ఉండేలా వైద్య బృందాన్ని నియమించాలని కోరారు. అధికారిక సమాచారాన్ని ప్రసార భారతి ద్వారా రోజుకు రెండుసార్లు వెల్లడించాలని, దానినే ప్రసారం చేస్తామని చెప్పారు. 

ఎయిర్‌ ఇండియా సిబ్బందికి అభినందనలు 

కరోనా బాధిత దేశాల నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్న ఎయిర్‌ ఇండియా సిబ్బందిని ప్రధాని ప్రశంసించారు. వారి సేవలు మానవత్వానికి ప్రతీకగా నిలిచాయని, వారిని చూసి దేశం మొత్తం గర్విస్తున్నదని ట్వీట్‌ చేశారు. విదేశాలకు వెళ్లి వస్తున్న ఎయిర్‌ ఇండియా సిబ్బందికి వారు నివసిస్తున్న కాలనీల ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని స్పందించారు. దీంతోపాటు ఈ నెల 25న వారణాసి నియోజకవర్గ ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నట్టు మోదీ తెలిపారు. తాజా పరిస్థితులను వివరిస్తామన్నారు. అదేవిధంగా కరోనాపై పోరుకు మోదీ ప్రతిపాదించిన ‘సార్క్‌ ఎమర్జెన్సీ ఫండ్‌'కు విరాళం ప్రకటించిన బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌ ప్రధానులకు కృతజ్ఞతలు తెలిపారు. 


logo