బుధవారం 23 సెప్టెంబర్ 2020
National - Aug 12, 2020 , 18:01:42

పీక‌ల్లోతు నీటిలోనూ అల‌వోక‌గా బైక్ రైడింగ్‌.. అందుకోసం బైక్ రూపాన్నే మార్చేశారు!

పీక‌ల్లోతు నీటిలోనూ అల‌వోక‌గా బైక్ రైడింగ్‌.. అందుకోసం బైక్ రూపాన్నే మార్చేశారు!

ఖాళీగా ఉన్న రోడ్డు మీద బైక్‌ను న‌డ‌పాలంటేనే కింద‌ప‌డుతుంటారు. కొంచెం ఇసుక వ‌స్తే వెనుక టైర్ ఇరుక్కుపోయి ఇబ్బంది పెడుతుంది. ఒక‌వేళ నీటిలోకి బైక్ గ‌నుక దిగిందంటే అంతే..కిర్.. కిర్ మ‌ని సౌండ్ త‌ప్ప ముందుకు వెళ్ల‌దు. అలాంటిది ఈ యువ‌కులు రోడ్డు మీద బైక్ న‌డిపిన‌ట్లుగా పీక‌ల్లోతు నీటిలోనూ న‌డిపేస్తున్నారు. ఇలా చేయ‌డానికి వారు బ‌లాన్ని కాకుండా బుర్ర‌ను ఉప‌యోగించారు. నీటిలో మునిగి న‌ప్పుడు బైక్ ఎందుకు ముందుకు న‌డ‌వ‌ద‌ని ఆలోచించారు. ఇంజిన్ త‌డుస్తుంది. అదే ఇంజిన్ పై భాగాన ఉంటే.. ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు క‌దా. మ‌రి ఇంజిన్‌నే మార్చేద్దాం అనుకున్నారు కాబోలు..

రెండు నిమిషాల‌కు పైగా ఉండే ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవ‌నీష్ శ‌ర‌న్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఇందులో వీరు బైక్ ఎలా న‌డుపుతున్నారో చూపించారు. బైక్‌కు ఉండే సైలెన్స‌ర్‌ను బైక‌ర్ త‌ల మీద‌కు మార్చేశారు. పెట్రోల్ ట్యాంక్‌ను లేకుండానే చేసేశారు. ఓ బాటిల్‌లో పెట్రోల్ పోసి పైపు ద్వారా ఇంజిన్‌ను అనుసంధానించారు. దీనివ‌ల్ల పెట్రోల్ ట్యాంక్‌లోకి నీరు చేర‌కుండా చేస్తుంది. ఇప్పుడు మ‌రేం ప్రాబ్లం లేదు. స‌వ్యంగా బైక్‌ను న‌డుపుకోవ‌చ్చు. 'ఇలాంటి విధానం ఎక్క‌డా చూడ‌లేద'‌నే శీర్షిక‌ను ఐఏఎస్ అధికారి జోడించారు. ఇలా చేయ‌డం ప్రాణాల‌కే ప్ర‌మాద‌క‌రం అని కూడా పేర్కొన్నారు. ఎంతైనా ఈ కుర్రాళ్ల తెలివితేట‌ల‌కు స‌లాం కొట్టాల్సిందే అంటున్నారు నెటిజ‌న్లు. 

 


logo