సోమవారం 06 జూలై 2020
National - Jun 21, 2020 , 14:06:25

బాబు కోసం అమ్మగా మారిన ఓ నాన్న!

బాబు కోసం అమ్మగా మారిన ఓ నాన్న!

భోపాల్‌ : పిల్లలకు తల్లి ఆప్యాయత ఎంత అవసరమో.. ప్రేమించే తండ్రి నీడ కూడా చాలా ముఖ్యం. ప్రపంచానికి మనల్ని తల్లి పరిచయం చేస్తే.. అదే నాన్న ప్రపంచాన్నే మనకు పరిచయం చేస్తాడు. అమ్మకు, బ్రహ్మకు నడుమ నిచ్చెన మాదిరి అవతారం ఎత్తిన ఈ తండ్రికాని తండ్రి.. తల్లి, తండ్రి.. ఇద్దరి పాత్రల్లో ఏకకాలంలో పరకాయ ప్రవేశం చేస్తున్నాడు. తండ్రుల దినోత్సవం సందర్భంగా ఈ తండ్రికాని తండ్రి గురించి తెలుసుకొందాం.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆదిత్య తివారీ. మానసికంగా ఎదగని ఓ చిన్నారిని చూసి చలించిపోయాడు. ఆ చిన్నారిని దత్తత తీసుకోవాలని అదే క్షణంలో నిర్ణయించుకొన్నడు. అయితే, ఎన్నో అడ్డంకులు.. ఏవో సంప్రదాయ కుయుక్తులు... ఇవన్నీ ఆయన తన లక్ష్యాన్ని చేరుకోకుండా అడ్డుకోలేకపోయాయి. 2016 జనవరి 1వ తేదీన ఆ చిన్నారిని దత్తత తీసుకొన్నాడు. ఈ విషయంలో సమాజం నుంచే కాకుండా సొంత కుటుంబం నుంచి కూడా వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. సుధీర్ఘ న్యాయపోరాటం చేసిన ఆదిత్య తివారి.. తుదకు ఆ మానసిక వికలాంగుడైన 22 నెలల వయసున్న బుజ్జాయిని దత్తత తీసుకొన్నాడు. 

అనంతరం చిన్నారి ఆలనాపాలన చూడటం కోసం సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉద్యోగానికి బైబై చెప్పేశాడు. దేశ్యవాప్తంగా పర్యటించి మానసిక వికలాంగులైన చిన్నారుల గురించి తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇవ్వడం ప్రారంభించాడు. ఇప్పటికే నిత్యం ఏదో ఒక ప్రాంతంలో స్పెషల్లీ ఏబుల్డ్‌ చిల్డ్రన్‌ గురించి ఉపన్యాసాలు ఇస్తుంటారు. దత్తత కుమారుడితో కలిసి దాదాపు 22 రాష్ట్రాల్లో అనేక వర్క్‌షాపులకు హాజరయ్యాడు. ఈయన సేవలను గుర్తించిన ఐక్యరాజ్య సమితి.. ప్రత్యేక పిల్లల పెంపకంపై ప్రసంగం చేయాలని ఆహ్వానించింది. ఇప్పుడు ఆదిత్య తివారి ఓ యువతిని పెండ్లి చేసుకోగా.. ఆమె కూడా ఆదిత్య మాదిరిగానే ఆలోచించి ఆ బాబుకు తల్లిగా పూర్తి మద్దతు తెలిపింది. ప్రస్తుతం చిన్నారి స్థానికంగా స్కూల్‌కెళ్లి యూకేజీ చదువుతున్నాడు. ఆదిత్య తివారి ప్రయత్నం కారణంగానే కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని మార్చడం ద్వారా దత్తత తీసుకునేవారి వయస్సు 30 నుంచి 25 సంవత్సరాలకు తగ్గించబడింది. ఈ ఏడాది నిర్వహించిన మదర్స్‌ డే సందర్భంగా ఆదిత్య తివారిని.. ది బెస్ట్ మదర్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ దిస్‌ ఇయర్‌ అవార్డుతో ఘనంగా సత్కరించారు.


logo