బుధవారం 03 జూన్ 2020
National - Apr 03, 2020 , 19:26:09

దేశం ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ కాదు

దేశం ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ కాదు

హైదరాబాద్‌: దేశంలో కరోనా చీకట్లు తొలగించేందుకు ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రతి ఇంట్లో లైట్లు ఆర్పేసి టార్చ్‌లైట్లు, కొవ్వొత్తులు, దీపాలు వెలిగించడం ద్వారా ఐక్యతను చాటుదాం అని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఇవాళ ఉదయం ఇచ్చిన పిలుపుపై ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ మండిపడ్డారు. లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి కూలీలు, వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి కోసం ఆర్థిక సహాయం లేదా ఎలాంటి ఉపశమనం కలిగించే ప్రకటన చేయలేదని ట్విటర్లో విమర్శించారు. 

'ఈ దేశం ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ కాదు. దేశ ప్రజలంతా మనుషులు.. వారికి కూడా ఆశలు, ఆకాంక్షలు ఉంటాయి.  మా జీవితాలను 9 నిమిషాల జిమ్మిక్కులతో  తగ్గించొద్దు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఏ సాయం చేస్తుందో చెప్పండి. ప్రణాళిక లేకుండా లాక్‌డౌన్‌ ప్రకటించి పేద ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆర్థిక సాయం అందించాలని కోరితే మీరు(మోదీ) మాత్రం మీ ఇంట్లోని లైట్లను ఆర్పేయండని పిలుపునిస్తున్నారు. పేదలకు ఎలాంటి సహాయం అందిస్తారో చెప్పండి. అసంఘటిత రంగంలో లక్షలాది మంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇళ్లకు వెళ్లేందుకు వలస కార్మికులు ఎదురుచూస్తున్నారు.   ఇవన్నింటిని విస్మరించి బదులుగా కొత్త డ్రామాతో మా ముందుకు వచ్చారని' ఓవైసీ మండిపడ్డారు. 


logo