గురువారం 06 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 14:32:35

ప్ర‌తి రోజు 22 కి.మీ. న‌డిచి.. ప‌దిలో 82 శాతం మార్కులు

ప్ర‌తి రోజు 22 కి.మీ. న‌డిచి.. ప‌దిలో 82 శాతం మార్కులు

ముంబై : ప‌ట్టుద‌ల ఉంటే సాధించలేనిది అంటూ ఉండదు. క‌ష్టాల‌ను కారణాలుగా చూపించ‌రు. క‌ష్ట‌ప‌డి చ‌దువుతారు. అడ్డంకుల‌ను అధిగ‌మించి.. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. విజ‌యాన్ని ముద్దాడుతారు. 

పుణె జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన అనంత దియోఫోడే(16) గురువారం విడుద‌లైన మ‌హారాష్ర్ట ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో 82.80 శాతం మార్కులు సాధించాడు. ఈ సంద‌ర్భంగా ఆ విద్యార్థిని మీడియా ప‌లుకరించింది. 

ప‌దో త‌ర‌గ‌తి ప్రారంభంలోనే ఈ ఏడాది నాకు ముఖ్య‌మైన‌ద‌ని భావించాను. మొద‌ట్నుంచే క‌ష్ట‌ప‌డి చ‌దివి మంచి మార్కులు సాధించాల‌నుకున్నాను. దానిక‌నుగుణంగా.. పొద్దున్నే 4 గంట‌ల‌కు లేచి 6 గంట‌ల వ‌ర‌కు చ‌దువుకున్నే వాడిని.  మ‌ళ్లీ సాయంత్రం స్కూల్ నుంచి వ‌చ్చాక రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు పుస్త‌కాల‌తో కుస్తీ ప‌ట్టేవాన్ని. అలా క్ర‌మం త‌ప్ప‌కుండా చ‌దివినందుకే 82 శాతం మార్కులు సాధించ‌గ‌లిగాను.

ఏడో త‌ర‌గ‌తి వ‌ర‌కు మా ఊళ్లోనే చ‌దివాను. పైత‌ర‌గ‌తుల‌కు పాన్‌షెట్ లోని ఉన్న‌త పాఠ‌శాల‌కు వెళ్లాల్సి వ‌చ్చింది. మా ఊరి నుంచి ఆ స్కూల్ 11 కిలోమీట‌ర్లు. బ‌స్సు సౌకర్యం ఉన్న‌ప్పటికీ.. అది స‌మ‌యానికి రాక‌పోయేది. దీంతో నేను, మ‌రో ఇద్ద‌రం క‌లిసి ప్ర‌తి రోజు 22 కిలోమీట‌ర్లు న‌డిచేవాళ్లం. న‌డ‌వ‌డానికే రోజు 2 గంట‌ల స‌మ‌యం ప‌ట్టేది. అనుకున్న‌ది సాధించ‌డం కోసం న‌డ‌క పెద్ద‌గా క‌ష్టం అనిపించలేదు. 


మా గ్రామంలో మాది మ‌ట్టి గుడిసె. ఇంట్లో ఫ్యాన్ కూడా లేదు. మాది నిరుపేద కుటుంబం. నాన్న హోట‌ల్‌లో వెయిట‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. ఇంట‌ర్ కోసం 60 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న పుణెకు వెళ్లాలి అనుకుంటున్నాను. భ‌విష్య‌త్‌లో యూపీఎస్సీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేరై ఐఏఎస్ కావాల‌న్న‌దే నా ల‌క్ష్య‌మ‌ని అనంత స్ప‌ష్టం చేశారు. logo