ఆదివారం 23 ఫిబ్రవరి 2020
మరో భారతీయుడికి కొవిడ్‌

మరో భారతీయుడికి కొవిడ్‌

Feb 15, 2020 , 02:55:46
PRINT
మరో భారతీయుడికి కొవిడ్‌
  • జపాన్‌ నౌకలో వైరస్‌ బారిన మూడో వ్యక్తి
  • చైనాలో 1,488కి చేరిన మృతుల సంఖ్య

బీజింగ్‌, ఫిబ్రవరి 14: కొవిడ్‌-19(కరోనా వైరస్‌) భయాందోళనల నేపథ్యంలో జపాన్‌ తీరంలో నిలిపివేసిన ‘డైమండ్‌ ప్రిన్సెస్‌' నౌకలో భారత్‌కు చెందిన మరో వ్యక్తికి వైరస్‌ సోకినట్టు జపాన్‌లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. ఇదివరకే ఇద్దరు భారతీయులు ఈ వైరస్‌ బారినపడిన సంగతి తెలిసిందే. నౌకలో మొత్తం 218 మందికి వైరస్‌ సోకినట్లు జపాన్‌ అధికారులు వెల్లడించారు. గత నెలలో డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌక నుంచి దిగిన హాంకాంగ్‌ ప్రయాణికుడికి కరోనా వైరస్‌ బయటపడిన నేపథ్యంలో.. గత వారం ప్రారంభంలో 3,711 మంది ప్రయాణికులతో జపాన్‌ తీరానికి చేరిన ఈ నౌకను ఆ దేశ అధికారులు అక్కడే నిలిపివేసి అందులోనివారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 19 వరకు అందరినీ నౌకలోనే ఉంచనున్నారు. నౌకలో భారత్‌కు చెందిన 132 మంది సిబ్బంది, ఆరుగురు ప్రయాణికులు కూడా ఉన్నారు.  వైరస్‌ సోకిన ముగ్గురు భారతీయుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఇండియన్‌ ఎంబసీ తెలిపింది. 


కాగా, పరీక్షల్లో ‘నెగెటివ్‌' అని వచ్చిన 80 ఏండ్లు పైబడిన వృద్ధులను నౌక నుంచి తరలించేందుకు జపాన్‌ ప్రభుత్వం అనుమతించింది. నిర్దేశిత గడువు వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక వసతిలో వారిని ఉంచనున్నారు. అద్దాలు పూర్తిగా మూసివేసిన బస్సులో శుక్రవారం మధ్యాహ్నం వారిని తరలించారు. అయితే ఈ క్యాటగిరీలో భారతీయులు ఎవరూ లేరు. కాగా, భారత్‌లో కరోనా పరిస్థితి నియంత్రణలోనే ఉన్నదని కేంద్ర వైద్య కార్యదర్శి ప్రీతీసూడాన్‌ తెలిపారు. వైరస్‌ నియంత్రణపై అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వైద్య కార్యదర్శులతో ఆమె శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కేరళలో ముగ్గురికి కరోనా నిర్ధారణ కాగా, అందులో ఒకరు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మిగిలిన ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ నెల 16-29 వరకు ఢిల్లీ-హాంకాంగ్‌ సర్వీసులను రద్దుచేస్తున్నట్లు స్పైస్‌జెట్‌ ప్రకటించింది.  


ఒక్క రోజులో 121 మంది..

కరోనా వైరస్‌ కారణంగా చైనాలో మరణించిన వారి సంఖ్య 1,488కి చేరుకున్నది. గురువారం ఒక్కరోజే 121 మంది మృతిచెందగా, కొత్తగా 5,090 కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్‌ సోకిన వారి సంఖ్య 65,000కు పెరిగినట్లు చైనా జాతీయ వైద్య కమిషన్‌ అధికారులు వెల్లడించారు. మరోవైపు, కరోనా వైరస్‌తో ఆరుగురు హెల్త్‌ వర్కర్లు మరణించారని, మరో 1,716 మందికి వైరస్‌ సోకిందని తెలిపారు.


logo