శుక్రవారం 29 మే 2020
National - Apr 08, 2020 , 01:32:09

70శాతం ఉత్పత్తి మనవద్దే!

70శాతం ఉత్పత్తి మనవద్దే!

  • దేశంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ కొరత లేదు
  • ఎగుమతికి సిద్ధంగా ఉన్నాం
  • అవసరమైతే ఉత్పత్తిని పెంచుతాం 
  • ఔషధ తయారీదారులు

న్యూఢిల్లీ: కరోనా రోగుల చికిత్స కోసం సాయపడుతుందని భావిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను తమ దేశానికి సరఫరా చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌కు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ భారత్‌ తమ అభ్యర్థనను మన్నించకపోతే, ప్రతిచర్య ఉండవచ్చని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో క్లోరోక్విన్‌ను అమెరికాకు ఎగుమతి చేసేంత నిల్వలు దేశంలో ఉన్నాయా? ఈ సమయంలో స్వదేశీ ఫార్మా సంస్థలు క్లోరోక్విన్‌ను ఏమేరకు ఉత్పత్తి చేయగలవు? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మలేరియాను నయం చేయడానికి వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్‌కు భారత్‌ అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్నది. ప్రపంచంలో దాదాపు 70 శాతం క్లోరోక్విన్‌ దేశంలోనే తయారవుతున్నది. జైదూస్‌ కాడిలా, ఐపీసీఏ, అలెంబిక్‌ వంటి దేశీయ ఫార్మా సంస్థలు ప్రధానంగా ఈ ఔషధాన్ని పెద్దమొత్తంలో ఉత్పత్తి చేస్తున్నాయి. ఏటా 20 కోట్ల యూనిట్ల(దాదాపు 40 మెట్రిక్‌ టన్నులు) క్లోరోక్విన్‌ ఔషధాన్ని భారత్‌ తయారు చేస్తున్నది. అంటే 200మిల్లీ గ్రాముల చొప్పున 20 కోట్ల మాత్రల్ని ఉత్పత్తి చేస్తున్నది. దీంట్లో దాదాపు 3 కోట్ల యూనిట్లు దేశీయ అవసరాలకు ఉపయోగపడగా, మిగిలిన 17 కోట్ల యూనిట్లు(75-80 శాతం) విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.ప్రభుత్వ లెక్కల ప్రకారం..ప్రస్తుతం దేశంలో 1-2 కోట్ల అదనపు క్లోరోక్విన్‌ నిల్వలు ఉన్నాయి. రానున్న 8 వారాల్లో క్లోరోక్విన్‌ అవసరం గణనీయంగా పెరిగినప్పటికీ, ఉత్పత్తిని పెంచేందుకు 400 పైగా తయారీ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ‘క్లోరోక్విన్‌ నిల్వలు సరిపడినంత ఉన్నాయి. ఒకవేళ దేశీయ అవసరాలతోపాటు, విదేశాలకు ఔషధాన్ని ఎగుమతి చేయాల్సి వస్తే, ఔషధ సంస్థలు క్లోరోక్విన్‌ను పెద్ద మొత్తంలో తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి’ అని ఔషధ తయారీదారులు వెల్లడించారు. క్లోరోక్విన్‌ ఉత్పత్తి ప్రక్రియను కొన్ని కంపనీలు ఇప్పటికే ప్రారంభించాయన్నారు. 


logo